చేర్యాల, అక్టోబర్ 23 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు మల్లన్నను దర్శించుకుని పరవశించి పోయారు. సుమారు 5వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు శనివా రం ఉదయం నుంచి మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేటుగా ఉన్న గదులు అద్దెకు తీసుకుని బస చేశారు. ఆదివారం వేకువజామునే కోనేటిలో స్నానం ఆచరించి, దర్శనం కోసం క్యూలో గంటల పాటు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని కోరికలు తీర్చాలని వేడుకున్నారు.
కొంతమంది భక్తులు అర్చన, ప్రత్యేక పూజ లు, కేశఖండన, నజరు, మహామండప, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు భక్తులు తమ మొక్కులు తీర్చాలని గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలగాలని మరికొందరు ఒల్లుబండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామివారిని వేడుకున్నారు. భక్తులకు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, డైరెక్టర్లు, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాస్‌శర్మ, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గుపూజారులు సేవలు అందించారు.
దీపావళి పం డుగ ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలి. లక్ష్మీనారాయణనుడి అనుగ్రహం తో ప్రజలకు అన్నింటా శుభం చేకురాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీకటిని పారద్రోలి వెలుగులు నిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షించారు. పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.