తొమ్మిది నెలలు కడుపున మోసి, పురిటి నొప్పులు భరించి బయటి ప్రపంచానికి పరిచయం చేశావు. నన్ను ఏడాది పాటు మీతో కుటుంబంలో ఒకరిగా ఉంచావు. అప్పుడే ఈ ప్రపంచం నుంచి నన్ను దూరం చేశావు.. అమ్మ ఎందుకు నన్ను ఇలా దూరం చేశావు. ఇన్ని రోజులు నన్నూ ఎంతో ప్రేమగా చూసి, మీ ఇద్దరి గొడవలతో నీటిలో పడేశావు. నేనేం తప్పు చేశా.. అమ్మా..
– నక్షత్ర
జహీరాబాద్, అక్టోబర్ 22: ఏడాది వయస్సున్న పాపను బావిలో వేసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగుడంపల్లిలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి గ్రామానికి చెందిన సతీశ్‌కు కర్ణాటకలోని చించొలి తాలూకా పరిధిలోని ఎంపల్లి గ్రామానికి చెందిన పుణ్యవతి, కృష్ణాగౌడ్ కుమార్తె అంబిక (23)ను కట్నకానులిచ్చి రెండేండ్ల క్రితం ఘనంగా పెండ్లి చేశారు. వీరికి ఏడాది పాప నక్షత్ర ఉంది. అదనపు కట్నం తీసుకురావాలని మృతురాలిని భర్త, అత్తమామల నుంచి వేధిపులు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మృతురాలు అంబిక, తన ఏడాది పాపను తీసుకుని గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ పట్టణ సీఐ తోట భూపతి, చిరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్ మొగుడంపల్లికి చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. బావిలోని నీటిని ఖాళీ చేయించి, మృతదేహాలను బయటకు తీశారు. మృతురాలి తండ్రి జైపాల్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. డీఎస్పీ రఘు, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ సందర్శించారు. దవాఖాన వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.