పెద్దశంకరంపేట, అక్టోబర్22: మెదక్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలోనూ ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. శనివారం పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఏడుగురు యువకులు కలిసి దొంగల మూఠాగా ఏర్పడి, గతేడాది నుంచి బుల్లెట్, పల్సర్ వంటి ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్నారన్నారు. వీరంతా నిజామాబాద్ జిల్లాలో పాత నేరస్తులని తెలిపారు.
ఈనెల 18న పెద్దశంకరంపేట మండలంలోని తిరుమలాపురం బ్రిడ్జి వద్ధ ఎస్సై బాలరాజు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేటు లేని రెండు బైక్‌లపై ముగ్గురు వ్యక్తులు వేగంగా అనుమానాస్పదంగా వస్తున్నారన్నారు. పోలీసులను చూసి వారు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా, వారిని వెంబడించి పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో రెండు, టేక్మాల్‌లో ఒకటి, చేగుంటలో రెండు, మనోహరాబాలో రెండు, సంగారెడ్డి జిల్లా ఎనిమిది, భువనగురి జిల్లాలో ఒకటి, నల్గొండ జిల్లాలో ఒకటి, కామారెడ్డి జిల్లాలో ఒకటి, మేడ్చల్ జిల్లాలో ఒకటి, హయత్‌నగర్ పరిధిలో ఒకటి మొత్తం 20 బైక్‌లు దొంగలించినట్లు ఒప్పుకున్నారన్నారు.
వీటితో పాటు మరో 8 బైక్‌ల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీళ్లు బైక్‌లు దొంగలించేందుకు ఒక బైక్, కారు ఉపయోగిస్తారన్నారు. బైక్ దొంగిలించిన వెంటనే దానికి చెందిన ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్ తొలిగిస్తారన్నారు. దొంగలించిన వాహనాల విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జంగం ప్రశాంత్, శివ్వంపేట మండలం రాబోజిపల్లికి చెందిన షేక్ ఫయాజ్, చాపల సంజీవ్, మెదక్ జిల్లా రామాయంపేట మండల ధర్మారం గ్రామానికి చెందిన పి.హరీశ్, నిజాంపేట మండలం నర్సాపూర్‌కు చెందిన బోయిని ప్రశాంత్, నిజామాబాద్ జిల్లా నాగారానికి చెందిన పల్లపు హరికృష్ణ, మక్కల లక్ష్మణ్ కలిసి ఈ దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. దొంగల మూఠాను పట్టుకునేందుకు శ్రమించిన మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జ్, పేట ఎస్సై బాలరాజు, రేగోడ్ సత్యనారాయణ, సిబ్బంది రాంసింగ్, వినోద్‌లను ఎస్పీ అభినందించారు.