జహీరాబాద్, అక్టోబర్ 21: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జహీరాబాద్ మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో నియోజకవర్గంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు పర్యవేక్షించి గడవులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఆడిషనల్ కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి. జడ్పీ సీఈవో ఎల్లయ్య, జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ సుభాశ్‌రావు దేశ్‌ముఖ్ తహసీల్దార్ నాగేశ్వర్రావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హోతి(కే) బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను అభినందించిన కలెక్టర్ శరత్
జాతీయ స్థాయి క్రీడా పోటీలకు జహీరాబాద్ మండలంలోని హోతి(కే) బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఎంపిక కావడంతో కలెక్టర్ శరత్ వారిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీలు పంజాబ్‌లోని జలంధర్‌లో నిర్వహిస్తున్నారని, విద్యార్థినులు వెళ్లేందుకు అవసరమైన వసతి, రైలు చార్జీలు చెల్లించేందుకు కలెక్టర్ కృషి చేయాలని మొగుడంపల్లి జడ్పీటీసీ అరుణామోహన్రెడ్డి కోరవడంతో వెంటనే స్పందించారు. జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నదని కలెక్టర్ తెలిపారు. వెంటనే డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు సహకరించిన జడ్పీటీసీ అరుణామోహన్రెడ్డి. మున్సిపల్ కమిషనర్ సుభాశ్‌రావు, మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకుడు నామ రవికిరణ్‌కు పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
దత్తగిరి ఆశ్రమంలో కలెక్టర్ పూజలు
ఝరాసంగం,అక్టోబర్21: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమంలోని జ్యోతిర్లింగాలకు శుక్రవారం కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనకు వైదిక పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమ గర్భగుడిలోని దత్తాత్రేయుడికి రుద్రాభిషేకం, కుంకుమార్చన, అర్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమంలోని పంచవృక్షాల చుట్టూ ప్రదక్షిణలు, పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పాల్గొని భక్తి, ఆశ్రమ విశిష్టత, సేవా కార్యక్రమాలు తదితర అంశాలపై మాట్లాడారు. ఇలాంటి ఆశ్రమం మన జిల్లాలో ఉండడం ఎంతో అదృష్టమన్నారు. ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవదూతగిరి మహరాజ్ స్వామి కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాజర్షి షా, ట్రాస్ట్ చైర్మన్ మాధవరెడ్డి, రంజోల్ ఆశ్రమ పీఠాధిపతి రాచయ్యస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నరసింహులు, తదితరులు ఉన్నారు.