సంగారెడ్డి అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ):పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ దవాఖానల్లో రూ. కోట్లు వెచ్చించి వసతులు కల్పించడంతో పాటు అవసరమైన చోట కొత్త దవాఖానలు నిర్మిస్తున్నది. ప్రధానంగా పట్టణ వాసులకు స్థానికంగా ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానలు సత్ఫలితాలిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 13 దవాఖానలుండగా, తాజాగా మరో ఆరు మంజూరు చేసింది. శిథిలావస్థకు చేరిన ఐదు పీహెచ్‌సీలను తొలిగించి అదే స్థానంలో నూతన భవనాలు ఒక్కో దాన్ని రూ. 1.56కోట్లతో నిర్మించేందుకు రూ. 7.80 కోట్లు కేటాయించింది. మరో పదమూడు పీహెచ్‌సీల మరమ్మతుల కోసం రూ. 60లక్షలు విడుదల చేసింది. సీసీ రోడ్లు, ప్రహరీల నిర్మాణం, విద్యుత్ సమస్యల పరిష్కారం, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులకు ఈ నిధులు ఖర్చుచేయనున్నారు. త్వరలో టెండర్లు పిలిచి అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పనున్నారు.
రాష్ట్ర ప్రభు త్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యతనిస్తున్నది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భారీగా నిధులు ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు ఆరు బస్తీ దవాఖానలు మంజూరు చేశారు. జిల్లాలో ఇదివరకే 13 బస్తీ దవాఖానలు ఉన్నా యి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చింతలపల్లి, అమీన్పూర్ మున్సిపాలిటీలో లింగమయ్యకాలనీ, బందంకొమ్ము, భీరంగూడలో బస్తీ దవాఖానలు పనిచేస్తున్నా యి. రామచంద్రాపురంలోని బాంబేకాలనీ, ఎస్ఎన్. కాలనీ, భరత్‌నగర్, కానుకంటలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. పటాన్‌చెరులోని చైతన్యనగర్, భారతీనగర్, బొల్లారంలోని ఎస్సీ కాలనీ, తెల్లాపూర్‌లోని ఇందిరానగర్, జహీరాబాద్‌లోని హమాలీ కాలనీలోదవాఖానలున్నాయి.
మరో ఆరు బస్తీ దవాఖానల ఏర్పాటు
సంగారెడ్డి జిల్లాకు మరో ఆరు బస్తీ దవాఖానలు మంజూరు చేశారు. సదాశివపేటలోని పాత దవాఖాన సమీపంలో,అందోలు మున్సిపాలిటీలోని 5వ వార్డు, నారాయణఖేడ్‌లో 3వ వార్డు, అమీన్పూర్లో 3వ వార్డు, సంగారెడ్డిలో 25వ వార్డు, జహీరాబాద్‌లో 24వ వార్డులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయనున్నారు.
పీహెచ్సీ భవనాల నిర్మాణానికి రూ.7.80 కోట్లు
జిల్లాలోని శిథిలావస్థకు చేరిన పీహెచ్‌సీలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.7.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని సిర్గాపూర్, నిజాంపేట, పుల్కల్, జిన్నారం, దౌల్తాబాద్‌లోని పీహెచ్‌సీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఐదు పీహెచ్సీ భవనాల నిర్మాణానికి రూ.7.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఒక్కో పీహెచ్సీ భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు ఖర్చు చేయనున్నారు.
13 పీహెచ్‌సీలకు మరమ్మతులు
తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఐడీసీ)తో జిల్లాలోని 13 పీహెచ్‌సీల్లో మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.60 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో గుమ్మడిదల, తాలెల్మ, దిగ్వాల్, మొగుడంపల్లి, రాయికోడ్, కానుకుంట, మునిపల్లి, బొల్లారం, మనూరు, కంగ్టి, మల్చెల్మ, న్యాల్కల్, రామచంద్రాపురం పీహెచ్‌సీల్లో మరమ్మతులు చేపట్టనున్నారు. పీహెచ్‌సీల్లో అవసరాన్ని అనుసరించి భవన మరమ్మతులు, సీసీ రోడ్డు నిర్మాణం, విద్యుత్ మరమ్మతులు, ప్రహారీ నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నారు. మరమ్మతులతో 13 పీహెచ్‌సీల రూపురేఖలు మారనున్నాయి.