మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో వానకాలం సీజన్లో 2.94 లక్షల ఎకరాల్లో వరి వేయగా, సుమారు 6.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని, రైతుల అవసరాలకు పోను 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. సొసైటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల్లోగా పూర్తి ధాన్యం సేకరించేందుకు అధికారులు సమాయత్తమవ్వాలని ఆదేశించారు. దీపావళి తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తవద్దని ఆదేశించారు.
రైతు సంక్షేమాన్ని కాంక్షించి దీపావళి తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. వానకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి శుక్రవారం స్థానిక ద్వారకా ఫంక్షన్హాల్లో, ఫ్యాక్స్ అధ్యక్షులు, ఐకేపీ, మారెటింగ్, వ్యవసాయాధికారులు, పౌర సరఫరాల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ వానకాలంలో 2.94లక్షల ఎకరాల్లో వరి వేయగా, 6.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉండగా, రైతుల అవసరాలు, విత్తనాలకు పోగా మారెట్కు 5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశముందని తెలిపారు.
ప్రభుత్వం ఏ-గ్రేడు రకం ధాన్యానికి రూ.2,060, సాధారణ రకం ధాన్యానికి రూ.2,040 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం సేకరణకు సుమారు కోటీ 60 లక్షల గోనె సంచులు అవసరమవుతాయని, అందుబాటులో ఉన్న 35 లక్షలు పోగా, మిగతావి కొత్త వి తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు రెండు వేల లారీలు సమకూరుస్తున్నామని తెలిపారు. మిల్లులకు వచ్చిన 24 గంటల్లోగా ధాన్యాన్ని లారీల నుంచి దించుకొని ట్రక్ షీట్ ఇవ్వాలని, ట్యాబ్ ఎంట్రీ వెంటనే జరగాలని సూచించారు. గతేడాది వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ఇంకా 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ చేయవలసి ఉందని, ఈ వారం రోజుల్లో కనీసం 50 వేల మె ట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ చేసి ఎఫ్సీఐకు పంపేలా చూడాలని రైస్ మిల్లర్లను కోరారు. ఈ సీజనుకు సంబంధించి ధాన్యంలో 3 లక్షల మెట్రి క్ టన్నులు ఇతర జిల్లాలకు పంపనున్నామని, కాగా మిగతా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 157 బాయిల్డ్, రా రైస్ మిల్లులకు సామర్థ్యానికి అనుగుణంగా కేటాయిస్తామన్నారు.
రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ రైస్ మిల్లుల్లో స్థలాభావం వల్ల గత సీజన్లకు సంబంధించి ఆరుబయట పెట్టిన ధాన్యం నల్లబడి, మొలకలెత్తుతున్నాయని, ఇబ్బడిముబ్బడిగా ధాన్యం మిల్లులకు రావడం వల్ల ధాన్యం నిలువ చేసుకోవడానికి గోదాములు లేక ఒత్తిడికి గురవుతున్నామని, ఎఫ్సీఐ వారు కూడా సీఎంఆర్ రైస్ తీసుకోవడానికి నిబంధనలు, కారణాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎఫ్సీఐ ప్రమాణాలకనుగుణంగా ధాన్యం తెచ్చేలా అవగాహన కలిగించాలని, కొత్త సంచులు అందించాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేలా చూడాలని కోరారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపాల్, డీఎస్వో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీనివాస్, వ్యవసాయాధికారి ఆశాకుమారి, సహకార అధికారి కరుణ, ఆర్డీవో సాయిరామ్, డీసీసీబీ డైరెక్టర్లు అనంతరెడ్డి, హనుమంతరెడ్డి, ఫ్యాక్స్ అధ్యక్షులు, డీపీఎంలు, ఏపీఎంలు, రైల్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతకు కృషి చేయాలి
సంగారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రభుత్వం వానకాలం పంటలకు నిర్ణయించిన కనీస మద్ద తు ధరలకు సంబంధించిన గోడ పత్రకను శుక్రవారం సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించి గిట్టుబాటు ధర పొందేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.