వృద్ధాప్యంలో ఆదరణ కరువైతే జీవితం నరకప్రాయంగా మారుతుంది. అలాగే దీర్ఘకాలిక రోగులు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు శారీరకంగా, మానసిక ఇబ్బందులతో కుంగుబాటుకు గురవుతుంటారు. ఇలాంటి వారికి అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆలన-ఆసర’ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వారికోసం పాలెయేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు కృషితో ఆలన కేంద్రం (పాలియేటివ్ కేర్ సెంటర్)ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను త్వరలో ప్రారంభిస్తారు. నిపుణుల ద్వారా వీరికి ఈ సెంటర్‌తో పాటు ఇంటి వద్ద కావాల్సిన వైద్యసేవలు అందిస్తారు. తద్వారా వారికి ఆత్మీయ ఆరోగ్య భరోసా లభించనున్నది.
సిద్దిపేట, అక్టోబర్ 13 : ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా సర్కారు కృషిచేస్తున్నది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండడం, అన్నిరకాల వ్యాధులకు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తున్నారు. జీవిత చరమాంకంలో ఆలన కరువైన వయో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో పాలెయేటివ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్ ద్వారా వారికి ఆత్మీయంగా ఆలనా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు త్వరలో ప్రారంభించనున్నారు.
వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఆత్మీయ భరోసాను కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆలన కేంద్రం (పాలియేటివ్ కేర్ సెంటర్)మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను దవాఖానలోని 4వ అంతస్తులో 7 బెడ్లతో ఏర్పాటు చేశారు. ఇందులో పక్షవాతం, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలకు గురై మంచానికే పరిమితమైన వారితో పాటు వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు అందించనున్నారు. దీర్ఘకాలిక రోగులు ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కణతులు రోజురోజుకు పెరగడం, నిరంతరం మంచంపై పడుకోవడంతో చర్మం, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడడం, రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగి కదలలేని స్థితిలో ఉన్న వారికి మానసిక ైస్థెర్యం పెంచేలా కౌన్సెలింగ్ ఇస్తారు. వ్యాధి తీవ్రత మేరకు వైద్యం పొందేలా సూచనలు చేస్తారు. నొప్పుల నుంచి ఉపశమనం పొందడం, గాయాలకు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలో ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. అత్యవసరం ఉన్న వారికి ఈ సెంటర్లో చేర్పించి 2-3 వారాల పాటు ఉచితంగా వైద్యం, మందులు అందిస్తారు. ఈ కేంద్రం ప్రారంభమైతే ఎంతోమంది పేదలకు ఉపయోగపడనున్నది. ఈ కేంద్రంలో ఒక పాలిటివ్ కేర్ ఫిజీషియన్‌తో పాటు పిజియోథెరపిస్టు, ఐదుగురు స్టాఫ్ నర్సులు ఉంటారు. వీరు కేంద్రంతో పాటు గుర్తించిన రోగుల ఇంటికి వెళ్లి శిక్షణ ఇస్తారు.
వయోవృద్ధుల ఇంటికి వెళ్లి సేవలు అందించేందుకు తొలిసారిగా ఫిజియోథెరపిస్టుల సేవల కోసం ప్రత్యేక వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. ఒకవైపు ‘ఆలన’ వాహనం ప్రభుత్వ దవాఖానలో వైద్యం పొందిన వారికి 3రోజులకోసారి ఇంటికి వెళ్లి అవసరమైన చికిత్స,సేవలు అందిస్తుంటే, మరోవైపు ‘ఆసర’ వాహనంతో ఇంటి వద్దకు వెళ్లి రోగులు, వయో వృద్ధులను ఆలన కేంద్రం (పాలియేటివ్ కేర్ సెంటర్) తీసుకు వస్తారు. 65 ఏండ్లు పైబడిన వృద్ధ్దులకు ప్రభుత్వ దవాఖానలోనే వైద్యసేవలు అందిస్తారు. వైద్యులు సూచించిన వారికి ఇంటి వద్దనే పిజియోథెరపీ సేవలు అందించే ఆసర సేవలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్నది. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందిన వారికి ఫిజియోథెరపిస్టు సేవలు అవసరమైన వారు దవాఖానలోని రూమ్ నెంబర్ 14లో నమోదు చేసుకోవాలి. వారంలో 3రోజులు దవాఖానలో, మరో మూడు రోజులు ఇంటి వద్దనే సేవలు అందించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు.వైద్యుల సూచన మేరకు రక్త నమూనాలను సేకరించి టీ హబ్‌లో పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత రిపోర్టులకు అనుగుణంగా చికిత్స అందిస్తారు.
వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఆరోగ్యం సహకరించని వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ సమస్యలతో పాటు ఆర్థిక స్థోమత లేకపోవడం మారిని మరింత కుంగదీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలతో పాటు ఆత్మీయ పలకరింపుతో వారికి సాంత్వన చేకూరే అవకాశం ఉంది. ఇలాంటి సేవలు అందించడం, పౌష్టికాహారం, జావా లాంటివి ఇచ్చే గొప్ప కార్యక్రమాలకు ఆలన కేంద్రం ఉపయోగపడుతుంది. ఇలాంటి సేవలు సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో అందుబాటులోకి రానుండడం సంతోషంగా ఉంది. పేదలకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి.
– తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి