మెదక్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సర్వే పారదర్శకంగా, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా నిర్వహించాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పోడు భూముల వెరిఫికేషన్‌పై అటవీ, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖాధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
గతేడాది డిసెంబర్ 4 నాటికి మెదక్ జిల్లాలో 15 మండలాల్లోని 62 గ్రామా పంచాయతీల్లో గల 65 నివాస ప్రాంతాల్లో 4,022 క్లెయిమ్స్ స్వీకరించి ఆన్లైన్లో పొందుపర్చామని తెలిపారు. అందులో గిరిజనుల నుంచి 1,096, గిరిజనేతరుల నుంచి 2,926 క్లెయిమ్స్ స్వీకరించామని వివరించారు. ఈ క్లెయిమ్‌ల వెరిఫికేషన్‌ను రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీ శాఖలు ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ రూపొందించుకుని సమన్వయంతో బుధవారం నుంచి గ్రామస్థాయిలో పర్యటించాలన్నారు.
2005కి ముందు నుంచి అన్యాక్రాంతమైన పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, 3 తరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరుల దరఖాస్తులు గ్రామస్థాయి కమిటీలో వారి సమక్షంలో సర్వే చేపట్టాలని, ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను రిజిస్టర్లను పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. సర్వే కోసం నియమించిన బృందం సభ్యులు వారికి కేటాయించిన గ్రామాల, ఆవాసాల సంపూర్ణ సమాచారం కలిగి ఉండాలన్నారు.
ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 కె్లైమ్స్ను క్షేత్రస్థాయిలో జీపీఎస్ డివైస్ ద్వారా సర్వే చేపట్టి మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. సర్వే నిర్వహణకు జిల్లాలో 65 జీపీఎస్ డివైస్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మానిటరింగ్ చేయాలని, సామరస్య పూర్వకంగా సమాచారాన్ని సేకరించాలని, అలసత్వం ప్రదర్శించిన వారిపై వేటు తప్పదని హెచ్చరించారు.
పోడు భూములు సాగు చేస్తున్న నిజమైన గిరిజన, గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించడంతో పాటు, భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణలు జరుగకుండా, వాటి పునర్జీవనానికి అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి రవిప్రసాద్, జడ్పీ సీఈవో శైలేశ్, డీపీవో తరుణ్‌కుమార్, గిరిజన అభివృద్ధి అధికారి కేశూరం, ఈడీఎం సందీప్, అటవీ, రెవెన్యూ శాఖాధికారులు, పంచాయత్‌రాజ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.