దుబ్బాక, అక్టోబర్ 11: దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి జోరందుకున్నది. నూతనంగా ఏర్పాటైన దుబ్బాక మున్సిపాలిటీ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రెండేండ్లలో ప్రగతి బాటపట్టింది. దుబ్బాక పట్టణంలో ప్రజల సమస్యలను మున్సిపల్ పాలకవర్గం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నది. ఇటీవల ప్రజల మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, కౌన్సిలర్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
వెంటనే ఆయన దుబ్బాక మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు చేయడమేకాకుండా వాటికి సంబంధించిన జీవో ప్రతులను అందజేసి, మరోసారి దుబ్బాకపై మమకారం చాటుకున్నారు. మంజూరైన నిధుల్లో రూ.11 కోట్లతో పట్టణంలో పలు బీటీ రహదారులు, అంతర్గత సీసీ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల దుబ్బాకకు వచ్చిన ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.11 కోట్లతో నిర్మాణ పనులు..
దుబ్బాకలో పలు అభివృద్ధి పనులకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ టీయూఎఫ్ఐడీసీ( తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా రూ. 20 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధుల్లో రూ.11 కోట్లు బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు మున్సిపల్ పాలకవర్గం తీర్మానించింది. రూ.11 కోట్లకు సంబంధించిన పనులకు ఇటీవల టెండర్లు పూర్తయ్యాయి. వీటికి సంబంధించిన పనులకు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
ఇందులో 4.5 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ లేయర్లు నిర్మించనున్నారు. దుబ్బాక బస్టాండ్ సమీపంలో పాత రోడ్డు, కొత్త రోడ్డు, గాంధీచౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, అంబేద్కర్ చౌరస్తా నుంచి రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు, దుబ్బాక తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీటీ రోడ్లు నిర్మించనున్నారు. దుబ్బాక బైపాస్ రోడ్డులో శివాజీ విగ్రహం చౌరస్తా నుంచి లచ్చపేట చౌరస్తా వరకు, లచ్చపేట చౌరస్తా నుంచి చీకోడ్ రోడ్డు వరకు ధర్మాజీపేట వార్డులో మార్కండేయ దేవాలయం వరకు, లచ్చపేటలో గాంధీ విగ్రహం నుంచి మోడల్ స్కూల్ వరకు, చెల్లాపూర్‌లో సోమేశ్వర దేవాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు బీటీ రోడ్లు నిర్మించనున్నారు. మొత్తం 5.9 కిలోమీటర్ల బీటీ రోడ్లు, సీసీ లేయర్లు, మరో 6.5 కోట్లతో దుబ్బాక పట్టణంలో 13.9 కిలోమీటర్ల మురుగు కాల్వలు , సీసీ రోడ్లు నిర్మించనున్నారు.
ఎంపీ సహకారంతోనే నిధులు మంజూరు
దుబ్బాక మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో పట్టణాభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. దుబ్బాకకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చిన వెంటనే జీవో ప్రతులు అందించడం మర్చిపోలేనిది.
ఆ నిధులతో పట్టణంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పాలకవర్గ సమావేశంలో తీర్మానించి, పనులు చేపడుతున్నాం. ఆ పనులకు ఇటీవల మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయడం సంతోషకరం. దుబ్బాక అభివృద్ధిలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారం మరువలేనిది. దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్లు, వంద పడకల దవాఖాన, కేసీఆర్ స్కూల్ భవనాలు పూర్తి చేశాం. అతి త్వరలోనే సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, కోర్టు భవనం, ఫైర్ స్టేషన్, తదితర కార్యాలయాల భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
– గన్నే వనితాభూంరెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్