మెదక్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ): జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ ఆర్డీవో సాయిరాం అధికారులకు సూ చించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ వెంటనే పరిషారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో 47 దరఖాస్తులు రాగా, అందులో 43 రెవెన్యూ, 4 వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.
చర్యలు తీసుకోవాలని అర్జీదారుల విజ్ఞప్తి
హవేళీఘనపూర్ మండలం సర్దనలోని కామునికుంట వాడలో డ్రైనేజీ సమస్య పరిషరించాల్సిందిగా ఆ గ్రామ నివాసి వెంకట కిషన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఇండ్ల మధ్యలో ఉన్న పాడుబడిన బావిని పూడ్చాల్సిందిగా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన కృష్ణయ్య, రామయ్య, పోచయ్య విజ్ఞప్తి చేశారు. తగు చర్య తీసుకోవాల్సిందిగా డీపీవోకు సూచించారు. మెదక్ మండలం ఖాజిపల్లిలోని సర్వే నంబర్ 198లో బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం స్థలం కేటాయించగా మాందాపూర్ తండా వాసులు కబ్జా చేసి మడికట్లు కడుతున్నారని, చర్య తీసుకోవాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో నర్సరీల్లో కూలీలుగా పని చేసిన 39 మందికి డబ్బులు రాలేదని, వెంటనే ఇప్పించాలని పోచయ్య, నర్సయ్య తదితర కూలీలు అభ్యర్థించారు. పరిశీలించాలని డీఆర్డీవోకు సూచించారు.
కొత్తగా మంజూరైన పింఛన్ డబ్బు ఇంతవరకు రాలేదని పలువురు ఫిర్యాదు చేయగా, మంజూరైన అందరికీ త్వరలో అందజేస్తారని తెలిపారు. మెదక్ మండలంలోని ఖాజిపల్లిలో గల 198 సర్వే నంబరులో ఉన్న అసైన్డ్ భూమిని 40 ఏండ్లుగా సాగుచేస్తూ జీవిస్తున్నామని, సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని, చర్యలు తీసుకోవాలని లంబాడీ గణేశ్, లంబాడీ మోహన్, లంబాడీ మల్లమ్మ ఫిర్యాదు చేశారు. వారసత్వంగా వచ్చిన 1.6 ఎకరాల పట్టా భూమి ధరణిలో లావణి పట్టాగా చూపారని, సరిచేయాల్సిందిగా టేక్మాల్ మండలం గొల్లగూడెం వాసి సొంగ చిన్న జోగయ్య అభ్యర్థించారు. చిలిపిచెడ్ మం డలం చిటూల్లోని తన భూమిలో కొంత భాగం అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న వారిపై చర్య తీసుకుని న్యాయం చేయాల్సిందిగా లంబాడీ మిత్యా నాయక్ ఫిర్యాదు చేయగా పరిశీలించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. దళితబంధు మంజూరు చేయాల్సిందిగా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన రంగేరి రత్నం అభ్యర్థించగా, దరఖాస్తు పరిశీలించాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, మైనార్టీ అధికారి జెంలా, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ రావు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, ఆబారీ శాఖ పర్యవేక్షకుడు రజాక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో..
మెదక్ అర్బన్,అక్టోబర్10: అర్జీదారుల సమస్యలు త్వర గా పరిష్కరించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అధికారులను సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. మాసాయిపేట మండలం రామంతాపూర్ తండాకు చెందిన గణేశ్ తన పశువులు మెపుతుండగా కొందరు వ్యక్తులు దారి కాచి తనపై దాడి చేసి, గాయపరిచారని, వారితో తనకు ప్రాణాపాయం ఉన్నదని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. చట్టప్రకారం ఫిర్యాదీకి న్యాయం చేయాలని రామాయంపేట సీఐకి సూచించారు. రామాయంపేట మండలం దంతెపల్లికి చెందిన వసంత తనకు సంతోశ్‌తో 2010లో వివాహమైందని, ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపింది. పైండ్లెన రెండేండ్ల వరకు బాగా చూసుకున్నాడని, ఆ తర్వాత వేరే అమ్మాయితే ఉంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. చట్టప్రకారం తగిన న్యాయం చేయాలని ఎస్సైని ఆదేశించారు.
సంగారెడ్డిలో గ్రీవెన్స్‌కు 28 వినతులు
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 10: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతివారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 28 అర్జీలు వచ్చాయని కలెక్టర్ శరత్ తెలిపారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. తమ పరిధిలోని సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ఆర్ఆర్ఆర్ వెళ్తున్న గ్రామాల్లో రైతులు భూములు కోల్పోయి, నష్టపోతున్నందున వారికి తగిన న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జన సమితి ప్రతినిధులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. బ్యాతోల్ గ్రామంలో నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని హిందూవాహిని నాయకులు విజ్ఞప్తి చేశారు. భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, రుణం మంజూరు తదితర అర్జీలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, అధికారులు పాల్గొన్నారు.