మెదక్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ దవాఖానల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదిలి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని ఆయా ప్రైవేట్ దవాఖానల్లో సరిపడా వైద్యులు ఉండరు, కనీస సౌకర్యాలు కానరావు. ఏండ్ల తరబడి ఆయా దవాఖానల్లో జరుగుతున్న కాన్పుల సమాచారాన్ని డీఎంహెచ్‌వోకు ఇవ్వడం లేదు. మెదక్ డివిజన్లో 85 ప్రైవేట్ దవాఖానలు ఉండగా, నర్సాపూర్ డివిజన్లో 35, తూప్రాన్ డివిజన్లో 40తో మొత్తంగా 160కి పైగా ప్రైవేట్ దవాఖానలున్నాయి. వీటిలో చాలా దవాఖానల్లో నిబంధనలు పాటించడంలేదు. ఇటీవల అధికారులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు 90 వరకు దవాఖానల్లో తనిఖీలు చేయగా, 7 దవాఖానలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఆర్ఎంపీ, పీఎంపీలతో కుమ్మక్కు..!
ప్రైవేట్ యాజమాన్యాలు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలతో కుమ్మక్కై వారికి పర్సంటేజీలు ఇస్తుండడంతో వారు ప్రైవేట్‌కు రోగులను పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోగిని దవాఖానకు తీసుకువచ్చినందుకు దాదాపు 50 శాతం ఆర్ఎంపీలకు ఇస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ దవాఖానల్లో వసతులు ఉన్నా రోగులను ఆర్ఎంపీలు ప్రైవేట్‌కు తీసుకువచ్చి మరీ చికిత్స చేయిస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది గ్రామీణులే బలవుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యులకు సంబంధించినవే చాలా వరకు ప్రైవేట్ దవాఖానలు ఉన్నట్లు సమాచారం. వీరు ఉదయం దవాఖానకు వెళ్లి సాయంత్రం వచ్చి క్లినిక్‌లు నిర్వహిస్తుంటారు. అటు ప్రైవేట్‌లో ఇటు ప్రభుత్వ దవాఖానల్లో అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి.
సౌకర్యాలు అంతంతే..
మెదక్ జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు రోగుల వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నా, అందుకు తగ్గట్టుగా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రసూతి దవాఖానల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రసవానికి ప్యాకేజీ పేరుతో రోగుల వద్ద వేలకు వేలు దండుకుంటూ గర్భిణుల వెంట వస్తున్న వారికి సైతం కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కొన్ని దవాఖానల్లో కనీసం తాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్ నుంచి మొదలుకొని అన్నీ సమస్యలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కల్పించుకొని ప్రైవేట్ దవాఖానల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు అనుమతి లేని వాటిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కాన్పుల సమాచారం కరువు..
ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు డీఎంహెచ్‌వోకు కనీసం కాన్పుల సమాచారం ఇవ్వడం లేదు. ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్న కాన్పుల సమాచారం డీఎంహెచ్‌వోకు సమాచారం ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్న ఆపరేషన్లు, సాధారణ ప్రసవాల సంఖ్య తెలియడం లేదు. ప్రైవేట్‌లో సాధారణం కంటే ఆపరేషన్లే ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. సాధారణ కాన్పులను ప్రోత్సాహించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించినప్పటికీ, అవేమీ పట్టనట్లుగా ప్రైవేట్ దవాఖానలు వ్యవహరిస్తున్నాయి.
నిబంధనలు పాటించాలి..
ప్రైవేట్ దవాఖానల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా 160కిపైగా ప్రైవేట్ దవాఖానలు ఉన్నాయి. ఇప్పటి వరకు 90 దవాఖానల్లో తనిఖీలు చేపట్టాం. ఇందులో 7 దవాఖానలకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించాం. మరో 5 దవాఖానలు రెన్యువల్ చేసుకోవాలి. వారం రోజులు సమయం ఇస్తున్నాం, ఆ తర్వాత సీజ్ చేస్తాం.
– విజయనిర్మల, డీఎంహెచ్‌వో మెదక్