వర్గల్, అక్టోబర్ 10 : గూడంటే గూడుకాదు వారిద్దరిది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు లాంటిది. కాయ కష్టం చేసుకుంటూ ఉన్న ఇద్దరి పిల్లలను అపురూపంగా చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెనుతుఫాన్ వచ్చింది. తమ ఏడేండ్ల కూతురుకు క్యాన్సర్ సోకడంతో దవాఖానలు తిరగాల్సి వచ్చింది. ఇల్లు కట్టుకుందామని రెక్కలు ముక్కలు చేసుకొని దాచుకున్న నాలుగు గవ్వలు కాస్త బిడ్డ దవాఖాన ఖర్చులకు కరిగిపోయాయి. వాటికి తోడు పెద్ద మొత్తం లో అప్పులు చేయాల్సి వచ్చింది. ఇంతచేసినా బిడ్డప్రాణం దక్కలేదు.అంతలోనే పెరుగుతున్న కొడుకు కంటిచూపు రోజు రోజుకు తగ్గడంతో ఆ దంపతులిద్దరూ మరింత కుదేలయ్యారు. ఆ దంపతులు కలత చెందిన జీవంలా బతుకు బండిని లాగుతున్నారు.
వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన ఆడెపు చంద్రమౌళి, స్వాతి 12 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వేలూర్ గ్రామానికి చెందిన స్వాతి కన్వర్టెడ్ క్రిస్టియన్‌గా కాగా, చంద్రమౌళి పద్మశాలీ. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు స్నేహం కుదిరి వీరి పరిచయం పరిణయం వరకు దారితీసింది. పెండ్లి అయిన ఏడాదిన్నరకు పాప జన్మించింది. స్వాతి క్రిస్టియన్ అయిందున పాపకు ఎస్తేర్ అని పేరు పెట్టారు. పాప తర్వాత రెండేండ్లకు బాబు పుట్టాడు.
ఇతడికి భరద్వాజ్ అని పేరు పెట్టారు. చిలకా గోరింకల మాదిరిగా హాయిగా పిల్లాపాపలతో గడిచిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. ఆడుతూ, పాడుతూ తిరుగుతున్న పాప రోజు రోజుకు అనారోగ్యం పాలవ్వడంతో పట్నంలోని ప్రైవేట్ దవాఖానలో చూపించారు. వైద్యుల నోట పాపకు క్యాన్సర్ సోకిందని, ప్రమాదస్థాయికి చేరిందని పిడుగులాంటి మాట వినాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ దంపతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రెక్కలకష్టం తప్పా ఏ ఇతర ఆదాయం లేని ఆజంట.. తమ పాపకు వచ్చిన మాయరోగం కోసం అనేక దవాఖానలు తిరిగారు. పాప మరణించడం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది. పాప చనిపోయిన కొన్ని రోజులకు కొడుకు భరద్వాజ కంటిచూపు కోసం ఎల్వీ ప్రసాద్ దవాఖానతో పాటు అనేక దవాఖానలు తిరిగినా 75 శాతం కంటి చూపు కోల్పోయాడని, ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఉండదని వైద్యులు తెలపడంతో బిక్కుబిక్కుమంటూ ఇంటి ప్రయాణమయ్యా రు.
తన తల్లిదండ్రుల ముఖాలు, ఇతర వస్తువులను ,చివరకు పుస్తకంలో అక్షరాలను సైతం కేవలం కంటికి బెత్తడు దూరంలోనే గుర్తుపట్టే భరద్వాజను చూస్తూ కాలం గడుపుతున్నారు ఆ దంపతులు. భరద్వాజ ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. తనతోటి వారికంటే చదువులో క్లాస్ ఫస్ట్‌గా ఉన్న భరద్వాజను చూసినవారు కంటిచూపు కరువైనా ,సరస్వతీమాత కటాక్షం ఉందని చూడముచ్చట పడుతున్నారు. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని విధివంచిత జంట రేకుల షెడ్డులోనే కాలం గడుపుతున్నారు. చంద్రమౌళి వాటర్‌మెన్‌గా, స్వాతి బీడీలు చుడుతూ ఉన్న కొడుకుతో లోకాన్ని చూస్తూ దినదినగండంగా.. నూరేళ్ల ఆయుష్షులా అంతులేని కథలా బతుకీడ్చుతున్నారు.