కొల్చారం, అక్టోబర్ 10: కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటింటికీ ఒకరి పేరు నవాజ్ ఉంటుంది. ఆ గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుచుకునే దర్గా ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా గ్రామంలోని ‘బంజ్ నవాజ్ దరా’్గ నిలుస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో బంజ్ నవాజ్ దర్గా ఉంది. దానికి కొనసాగింపుగా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామంలో నెలకొల్పారు. గుల్బర్గాలోని బంజ్ నవాజ్ దర్గాలో ఏటా ఉర్సు నిర్వహించిన మరుసటి రోజే ఇక్కడా ఉత్సవాలు నిర్వహిస్తారు.
భక్తుల పాలిట కొంగు బంగారంగా..
ఈ దర్గాను నమ్ముకుంటే అనుకున్న పనులు విజయవంతమవుతాయని భక్తుల నమ్మకం. కుల, మతాలకతీతంగా ఈ దర్గాలో పూజలు చేస్తుంటారు. భక్తుల నమ్మకం వ మ్ము కాకుండా సంతానం కలగడం, పెండ్లి సంబంధాలు కుదరడం, గృహ నిర్మాణాలు చేపట్టడం వంటివి ఎలాంటి ఆటం కం లేకుండా సాగుతున్నాయి. దీంతో అనుకున్న పని పూర్తయిన వెంటనే కొబ్బరి కాయలు కొట్టడం నుంచి కందూర్లు (న్యాజ్లు) చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమ ఇండ్లలో పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టుకుంటున్నారు.
ఇంటికో నవాజ్ పేరు
ఊర్లో ఎవరికైనా సంతానం కాకుంటే ఈ దర్గాలో మొక్కుకుంటారు. దీంతో మగ పిల్లలు పుడితే నవాజ్ అని, ఆడపిల్లలు పుడితే నవమ్మ అని పేరు పెడతారు. రెడ్డి, ముదిరాజ్, కుర్మ, మున్నూరుకాపు వంటి సామాజిక వర్గాలకు చెందినవారు కులాలకతీతంగా ఈ దర్గాలో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ విధంగా మొక్కుకున్న కుటుంబీకులు ఇంట్లో ఎలాంటి శుభ కార్యాలు జరిగినా (గృహ ప్రవేశాలు, వివాహాలు) ముందు ఈ దర్గా వద్ద మొక్కులు చెల్లించుకుని న్యాజ్లు చేస్తుంటారు.
మొక్కు ప్రకారమే నాకు పేరు పెట్టారు
మా తల్లిదండ్రులు సంతానం కోసం బం జ్ నవాజ్ దర్గాలో మొక్కితే నేను పుట్టానంట. అందుకే నా పేరు నవాజ్ అని పెట్టారు. మా ఊర్లో చాలామంది మగవారికి నవాజ్ అని, ఆడవారికి నవమ్మ అని పేర్లు ఉన్నాయి. కోరుకున్న వారి కోరికలు తీర్చే దైవంగా భాసిల్లుతున్నారు.
– నవాజ్రెడ్డి, మొగుడంపల్లి
అంతా దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు
కుల, మతాలకతీతంగా ప్రతిఒక్కరూ దర్గా లో సంతానం, శుభకార్యాల కోసం మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు తీరిన వెంటనే మొక్కులు సమర్పించుకుంటారు. సంతానం కాని వారికి ఈ దర్గా పెట్టింది పేరు. సంతానం గురించి బంజ్ నవాజ్ దర్గాలో మొక్కిన వారికి తప్పకుండా సంతానం అవుతుందని నమ్మకం.
– ఆకుల నవాజ్
అనుకున్నవి జరుగుతాయి
గుల్బార్గాలో బంజ్ నవాజ్ దర్గా ఉంది. అదే దర్గాను మా పూర్వీకులు సంగాయిపేటలో నెలకొల్పారు. అప్ప టి నుంచి భక్తుల కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కొలుస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు కాని వారు ఈ దర్గాలో మొక్కుకుంటే పిల్లలు పు డతారని నమ్మకం. అలా పుట్టిన మగ పిల్లలకు నవాజ్ అని, ఆడపిల్లలకు నవమ్మ అని పేరు పెడుతుంటారు. గృహ ప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాలు నిర్వహించే ముందు దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం.
– ఖాజా, దర్గా ఇమామ్