హవేళీఘనపూర్, అక్టోబర్ 10 : గ్రామాలను పచ్చదనం గా మార్చి ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం అందరిపై ఉందని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం హవేళీఘనపూర్ ఎంపీడీ వో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న పలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించి వారికి నష్టపరిహారం అందే లా చూడాలని వాడి సర్పంచ్ యామిరెడ్డి కోరారు. మెదక్-ఎల్లారెడ్డి బస్సులు హవేళీఘనపూర్ మీదుగా నడిచే బస్సులను మెదక్ వయా కూచన్‌పల్లి, ఫరీద్పూర్, సర్దన మీదుగా ఎల్లారెడ్డికి ఆర్టీసీ బస్సులు నడుపాలని కోరారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్వగ్రామాల రైతులవి కాకుండా ఇతర గ్రామాల రైతుల వరిధాన్యం కొనుగోలు చేయడం ద్వారా స్థానిక రైతులకు ఇబ్బందులు ఎదువుతు న్నాయన్నారు. అనంతరం ఎంపీపీ శేరి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధి బాట లో తీసుకెళ్లేందుకు గ్రామాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, మురుగు కాలువల పరిశుభ్రత, తాగునీటి సరఫరా లాంటి వాటి అమలులో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని, ఆ దిశగా ముందుకు తీసుకెళ్లి రాష్ర్టాన్ని అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ప్రభుత్వం గతంలో మాదిరిగా కాకుండా దవాఖానల్లో మంచి డాక్టర్లను నియమించి వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నందున ప్రజలు కూడా ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని కోరారు.
మండలంలోని పలు అంశాలపై చర్చించేందుకు వైద్య, విద్యుత్, అటవీ శాఖ అధికారులు గైర్హాజరు కావడం పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. సమావేశంలో మెదక్ పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, మండల కో-అప్షన్ సభ్యులు ఖాలేద్, ఎంపీడీవో శ్రీరామ్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు యామిరెడ్డి, సవిత, మహిపాల్‌రెడ్డి, పద్మ, దేవాగౌడ్, రాజేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు మంగ్యా, రాజయ్య, స్వప్నతో పాటు ఆయా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రశాంతంగా మండల సర్వసభ్య సమావేశం
తూప్రాన్ ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ స్వప్నావెంకటేశ్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో ప్రధానంగా విద్య, వైద్య, విద్యుత్, వ్యవసాయ, పశువైద్య, రెవెన్యూ తదితర శాఖలపై సమీక్ష, పురోగతిపై అధికారులు వివరించారు. కొన్ని శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో రమేశ్, వైస్ ఎంపీపీ శరణ్య, అధికారులు పాల్గొన్నారు.