మెదక్ అర్బన్, అక్టోబర్9: సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. దేశంలో ఇప్పుడంతా 5జీ నెట్వర్క్ మానియా నడుస్తుండడంతో దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. 4జీ నుంచి 5జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని వినియోగదారులకు లింకులు పంపిస్తున్నారు. కంపెనీ వాళ్లే పంపారని వాటిని క్లిక్ చేసి, ఓటీపీలు చెబితే మీ మొబైల్లోని వ్యక్తిగత సమాచారం హ్యాక్ అవడంతో పాటు అకౌంట్లలో డబ్బులు కూడా పోయే ప్రమాదం ఉంది. 5జీకి సంబంధించి ఇలాంటి మెసేజ్‌లకు ఎవరూ స్పందించొద్దని, ఒకవేళ సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఎవరైనా మోసపోతే వెంటనే 1930కి డయల్ చేయాలని సూచిస్తున్నారు.
దేశంలో కొత్తగా 5జీ సేవలు ప్రారంభించారు. దీంతో 5జీ సాంకేతికత వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ముంబా యి, ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు 13 మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆయా నగరాల్లోని మొబైల్ వినియోగదారులపై కన్నేశారు.
లింక్ క్లిక్ చేస్తే అంతే..
నాలుగు ప్రముఖ టెలికాం సంస్థలు మాత్రమే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ సంస్థల వినియోగదారులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ఫైల్స్ ఉన్న లింకుల ద్వారా మొబైల్స్‌కు పంపిస్తున్నారు. టెలికాం సంస్థలే వాటిని పంపిస్తున్నాయనే భావనతో వాటిపై క్లిక్ చేస్తే తిప్పలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవి మాల్వేర్ ఫైల్స్కావడంతో రహస్యంగా సెల్పోన్లలోకి వస్తున్నాయి. ఒక్కసారి మొబైల్‌లోకి వస్తే ఫోన్లో ని డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుంది. అందు లో వ్యక్తిగత చిత్రాలు ఇతర రహస్యాలు ఉంటే వాటిని వినియోగించుకుని బెదిరింపులకు దిగే అవకాశం ఉంటుంది. నిజానికి 5జీ సేవలు పొందాలంటే 5జీ సిమ్‌తోపాటు 5జీ సపోర్ట్ చేసే ఫోన్ ఉండాలి. అంతే కాని లింకులు, ఆప్స్, ఓటీపీ ద్వారా 5జీ సిమ్ కాదు.
ఆన్లైన్ లింకుల జోలికి పోవద్దు
ఆన్లైన్ లింకులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ లింక్‌లు పంపుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. నగదును ఆశ చూపి, వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఎరవేసి అప్పులిస్తామని ఆశ పెడుతున్నారు. వివరాలు తీసుకుని అడిగిన సొమ్ము ఆన్లైన్లో పంపించేస్తున్నారు. మొత్తం తిరిగి చెల్లించినా ఇంకా ఇవ్వాలని వేధింపులకు దిగుతున్నారు. ఆన్లైన్లో వస్తువులు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మకమైన యాప్‌లనే వినియోగించండి.
ఓటిపీ చెప్పొదు….
సైబర్ క్రిమినల్స్ మన ఫోన్ నంబర్ల ద్వారా బ్యాంక్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నా రు. వాటితో ఆన్లైన్లో పలు వాలెట్లలో కొనుగోలు చేసి సిద్ధంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఫోన్లు చేసి, మీరు ఆర్డర్ చేశారు కదా.. డెలివరీ చేయడానికి వచ్చా ను.. ఈ వీధిలోనే ఉన్నాను.. అని చెబుతున్నారు. ఏ ఆర్డర్ ఇవ్వలేదంటే .. రద్దు చేస్తున్నాను. మీకు ఓటీపీ వస్తుంది, అది చెప్పండి అంటున్నారు. మరి కొంతమంది మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఖాతా కొనసాగించాలి అంటే మీరు కేవైసీ చేసుకోవాలి అని చెప్పి కేవైసీ కోసం మీ ఆధార్ కార్డ్ వివరాలు చెప్పండి అని మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. చెప్పండి తర్వాతా మీ కేవైసీ పూర్తి అవుతుందని చెప్తారు.. అలాంటి వారికి ఓటీపీ చెప్పొదు. చెబితే మీ ఖాతా ఖాళీ అవుతుంది.
డయల్ 1930
5జీ, ఆన్లైన్ లింకుల ద్వారా మోసపోయిన వారు డయల్ 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఈ 1930 నంబర్ నేరుగా తెలంగాణ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ వెళ్తుంది. మీకు జరిగిన మోసాన్ని 1930 నంబర్‌కు గాని లేదా డయల్ 100కి గాని లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.
5జీ చాటున మోసం
నూతనంగా దేశంలో 5జీ సేవలు ప్రారంభించడంతో సైబర్ మోసగాళ్లు 4జీ నుంచి 5జీకి మారలంటూ ఫోన్లలో లింకులు పంపిస్తున్నారు. ఆ లింకులను ఓపెన్ చేస్తే మీ సెల్ఫోన్లో ఉండే వ్యక్తి గత సమచారం అంతా సైబర్ కేటుగాళ్లకు వెళ్లిపోతుంది. దీంతో వారు బెదిరింపులకు దిగుతున్నారు. టెలికాం సంస్థలు పంపిస్తున్నట్లు వస్తున్న 5జీ లింకులను ఓపెన్ చేయవద్దు. ఆన్లైన్లో కనిపించినా ప్రతి లింక్‌ను క్లిక్ చేయకూడదు. లింకులు ఓపెన్ చేసి, మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
– మధు, మెదక్ పట్టణ సీఐ