చేర్యాల, అక్టోబర్ 9 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం సుమారు15 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. స్వామి వారి దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకుని ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నా లు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు,కొడెల స్తంభం వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఈవో ఎ.బాలాజీ, ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అం జయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్త లు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.
మల్లన్న క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక కృషి
మల్లన్న క్షేత్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్న ఆలయ కార్యాలయంలో మల్లన్న ఆలయ అభివృద్ధిపై ఈవో బాలాజీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో జరుగుతున్న నిర్మాణ పనులపై చర్చించారు. ఇటీవల మృతి చెందిన ఆలయ ఉద్యోగి బత్తిని పోచయ్య కుమారుడు నవీన్‌కుమార్‌కు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించడంపై చర్చించారు. మల్లన్న కల్యాణం, జాతర ఏర్పాట్లు, పెండాల్స్, విద్యుత్ అలంకరణ, సౌండ్ సిస్టం, క్యూ, వాటర్ సైప్లె, టికెట్ కౌంటర్, తాత్కలిక క్యూలైన్లు, తాత్కలిక పందిళ్ల ఏర్పాటుపై చర్చించారు. ఎల్లమ్మ ఆలయం వద్ద తాత్కాలిక పందిళ్లు, క్యూలైన్ల గురించి చర్చించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రసాదశాల, బుకింగ్ క్యూలైన్లతో పాటు ప్రభుత్వం మల్లన్న ఆలయానికి కేటాయించిన భూములకు సర్వే ,ఫెన్సింగ్‌పై చర్చించారు. టీటీడీ కల్యాణ మండపం వెనుకభాగంలో వాహనాల పూజలకు సీసీతో ప్లాట్‌ఫాం ఏర్పాటుపై చర్చించారు. మల్లన్న ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, నీల శేఖర్, మల్లన్న ఆల య ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.