మెదక్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మద్యం బాబులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక టీమ్‌లు మద్యం బాబులపై నిఘా పెంచాయి. మెదక్ జిల్లా కేంద్రంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని బహిరంగ ప్రదేశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం తాగుతూ కనిపించే వారి ఫొటోలు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వారికి జరిమానాలు విధిస్తున్నారు. వరుసగా మూడుసార్లు మద్యం తాగి దొరికితే కేసు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమం లో రోజూ జిల్లాలో సుమారు 40 నుంచి 50కిపైగా కేసులు నమోదవుతున్నాయి. శని, ఆదివారాల్లో మద్యం బాబులు ఎక్కువ సంఖ్యలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారు. ఇందులో యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కడ చూసినా మద్యం ప్రియులే కనబడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు మెదక్ పట్టణ సీఐ మధు ఆధ్వర్యంలో ఎస్సైలు, బ్లూ కోర్టు టీంలను రంగంలోకి దింపి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారి భరతం పడుతున్నారు.
జాతీయ రహదారులపైనా తనిఖీలు
మెదక్ జిల్లాలో మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, రామాయంపేట వరకు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. జాతీయ రహదారిపై పుట్టగొడుగుల్లా దాబాలు వెలిశాయి. కొన్ని దాబాల్లో రహస్యంగా మద్యం తాగుతున్నట్లు సమాచారం. మద్యం సేవించిన తర్వాత రోడ్డు ప్రమాదాలు జరిగి మృత్యవాత పడ్డ ఘటనలు జాతీయ రహదారిపై ఎన్నో ఉన్నాయి. దీంతో పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేని వాహనదారులతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారికీ జరిమానాలు విధిస్తున్నారు. మెదక్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల వనదర్గా ఆలయాల వంటి ప్రదేశాలకు వచ్చే వాహనదారులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. అతిగా మద్యం సేవించిన వారికి రూ.1,100 ఫైన్‌తో పాటు కొందరికీ జైలు శిక్షణ విధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే ఉపేక్షించేది లేదు. జిల్లా కేంద్రం నుంచి నాలుగైదు కిలోమీటర్ల మేర ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారు. వారిపై కేసులు నమో దు చేస్తున్నాం. ఈ విషయాన్ని మద్యం ప్రియులు గమనించాలి. ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న కనిపిస్తే స్థానికులు వెంటనే 100 డయల్‌కు సమాచారం అందించాలి.
– మధు, మెదక్ పట్టణ సీఐ