కొండాపూర్, అక్టోబర్ 8: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరంగా మారుతున్నది. ఆరోగ్య శ్రీ సేవల కిందికి రాని శారీరక రుగ్మతలకు ఈ పథకం ఆపన్నహస్తంలా నిలుస్తున్నది. దారిద్య్ర రేఖకు దిగువ ఉండి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ఈ పథకం ఆదుకుని వారి ప్రాణాలు కాపాడుతున్నది. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. సంగారెడ్డి నియోజకవర్గానికి ఇప్పటి వరకు రూ.15 కోట్లకు పైగా చెక్కులను సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సీఎం సహాయనిధి కింద సాయం కోరిన ప్రతి లబ్ధిదారుడికి, వచ్చిన ప్రతి దరఖాస్తుకు త్వరగా స్పందిస్తూ ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇంటికే చెక్కులు పంపిస్తున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతున్నారు.
కార్పొరేట్ వైద్యం అందిస్తున్న పథకం
వివిధ కారణాలతో, శారీరక రుగ్మతలకు సంబంధించిన వ్యాధులు సోకిన వారు చికిత్స కోసం కార్పొరేట్ దవాఖానలకు పరుగెడుతున్నారు. చాలామంది దవాఖానకు అయ్యే ఖర్చుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు చేసి వైద్య ఖర్చుల నిమిత్తం బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత అప్పు తీర్చే మార్గాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో భరోసానిస్తూ ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నది. కేవలం కొండాపూర్ మండలంలోనే సుమారు రూ.4 నుంచి రూ.5 కోట్లకు పైగా చెక్కులు, ఎల్వోసీలను అందజేశారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇప్పటివరకు సంగారెడ్డి నియోజకవర్గానికి రూ.15 కోట్లకు పైగా చెక్కులు అందజేశాం. ముందస్తు వైద్య ఖర్చుల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) బాండ్లనూ పంపిణీ చేశాం. కొండాపూర్ మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు సుమారు రూ.4 నుంచి రూ.5 కోట్లకు పైగా చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశాం. పేదలకు సర్జరీ, లివర్, కిడ్నీ, ఇతర వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరికీ ఆదుకుంటున్నది. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి, యాక్సిడెంట్ అయిన వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో సాయ పడుతున్నది. రాజకీయాలకతీతంగా చెక్కులు అందజేస్తున్నాం. నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో చెక్కుల పంపిణీకి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – చింతా ప్రభాకర్,
చైర్మన్, హాండ్లూమ్ కార్పొరేషన్