అందోల్/వట్పల్లి, అక్టోబర్ 8: వట్పల్లి మార్కెట్ యార్డులో శనివారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిర్వహించిన అలాయ్-బలాయ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరటి వెంకన్న, మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని అన్నారు. అలాయ్-బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరినీ ఒకచోటకు చేర్చడంతో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాతరోజులు గుర్తుచేశారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి క్రాంతికిరణ్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, దేశ రాజకీయాల్లో సైతం క్రియాశీలకం కానున్నారన్నారు. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని, బీజేపీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలనేది యావత్ దేశ ప్రజల కోరిక అన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దేశ రాజకీయాల్లో సత్తా చాటుతుందని, రానున్న రోజుల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నదన్నారు.
కార్యక్రమానికి హాజరైన వారికి ఎమ్మెల్యే మెమొంటో అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూ జే రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్, పార్టీ రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్, ఉదయ్‌కిరణ్, భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, సర్పంచ్ సురేఖాబుద్ధిరెడ్డి, ఎంపీటీసీ ఇందిర, ఏఎంసీ చైర్మన్ రజినీకాంత్, ఎంపీపీలు కృష్ణవేణి, బాలయ్య, శైలజ, జడ్పీటీసీలు అపర్ణ, మీనాక్షి, మల్లికార్జున్, ఆత్మ చైర్మన్లు యాదగిరిరెడ్డి, విఠల్, వరము చైర్మన్ వీరారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అశోక్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు, నాయకులు బస్వరాజ్, మధు, మహేందర్‌గౌడ్, ప్రకాశ్, లింగాగౌడ్ పాల్గొన్నారు.
షర్మిల నిజాలు తెలుసుకుని మాట్లాడాలి:మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడిందని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. జర్నలిస్టుల సమస్యల కోసం తనతో చర్చించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారన్నారు. షర్మిల క్రాంతి కిరణ్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మీ అన్న సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల సమస్యల కోసం కృషిచేస్తున్నారా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అలాయ్-బలాయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ తీరు దేశానికి చాలా ప్రమాదకరంగా మారిందని, ప్రజలు బీజేపీతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
అందరి సహకారంతో మరింత అభివృద్ధి : అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అందరి సహకారంతో రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రతిపక్షాల కండ్లు తెరిపిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలాయ్-బలా య్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మె ల్యే మీ ఆదరాభిమానం నాపై ఇలాగే ఉండాలని, మీ అందరి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆశీస్సులతో గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
ఆట పాటలతో తెలంగాణ అభివృద్ధిని వివరించిన గోరటి వెంకన్న
సీఎం కేసీఆర్ మంచి మనసున్న నాయకుడని, ముందు చూపుతో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిపోయిన చెరువులు, పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లే కూలీలు దర్శనమిచ్చేవారని, కానీ, స్వరాష్ట్రంలో అలుగు పారుతున్న చెరువులు, పచ్చని పంటలతో పొలాలు దర్శనమిస్తూ చేతినిండా పనిదొరుకుతూ కూలీలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇతర రాష్ర్టాలకు కూలీకి వెళ్లే తెలంగాణ బిడ్డలు సొంత రాష్ట్రంలో దర్జాగా బతుకుతూ పొరుగు రాష్ర్టాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారన్నారు. మోదీ పాలన ఆదానీ, అంబానీలకు దాసోహం అంటున్నదని విమర్శించారు. ఒకప్పుడు పారిశ్రామిక వేత్తలు దేశంకోసం సహాయం అందించేవారని కానీ, మోదీ మాత్రం రైల్వే స్టేషన్లు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, ప్రతీది ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కొనిడాయారు. ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఎమ్మెల్యేకు అండగా నిలువాలన్నారు. నియోజకవర్గం సస్యశ్యామ లం చేసేందుకు బసవేశ్వర-సంగమేశ్వర ఎత్తిపోతలు తీసుకువస్తున్నారని, రేణుకా ఎల్లమ్మతో ఇప్పటికే పడావు భూములు పచ్చగా మారాయన్నారు.

ఆటపాటలతో అలరించిన మిట్టపల్లి సురేందర్, మధుప్రియ
మిట్టపల్లి సురేందర్, మధుప్రియ పాటలు.. గోరటి వెంకన్న స్టెప్పులతో వట్పల్లి మార్కెట్ యార్డు దద్దరిల్లింది. దసరా, బతుకమ్మ పండుగల విశిష్టతను వివరిస్తూ తెలంగాణ జానపదాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ పాడిన పాటలు కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపాయి. జబర్దస్త్ కమేడియన్ రచ్చరవి తనదైన పంచులతో ప్రజల్లో మరింత జోష్‌ను నింపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల అధ్యక్షులు ఎమ్మెల్యే, ఎంపీలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.