గజ్వేల్, అక్టోబర్ 7: ప్రజల మెప్పును పొందేవిధంగా విధులు నిర్వహించాలని సీపీ శ్వేత పోలీస్ సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు పోలీస్ స్టేషన్‌ను ఆమె సందర్శించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి స్టేషన్ పరిసరాల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పరిశీలించి త్వరగా డిస్పోజబుల్ చేయాలని ఎస్సై రంగకృష్ణకు సూచించారు. కేసుల ఫైళ్లను సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, త్వరగా కేసులను పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
మూడేండ్ల నుంచి నమోదవుతున్న కేసుల గురించి పరిశీలించారు. సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది పోటీపడి పనిచేయాలన్నారు. అంకితభావంతో నిధులు నిర్వహించే వారికి రివార్డులు, అవార్డులు ఇస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. రౌడీలు, కేడీలు, అనుమానితులు, సంఘ విద్రోహశక్తులపై నిరంతరం నిఘా ఉంచి వారి కదలికలను గమనించాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతిఒక్కరికీ తెలిసి ఉండాలని సూచించారు.
పోలీసు అధికారులు వారంలో రెండుమూడు సార్లు సంబంధిత గ్రామాలను సందర్శించి, సమస్యలపై ఆరా తీయాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సీసీటీఎన్ఎస్ ద్వారా ప్రతి దరఖాస్తులను, ఎఫ్ఐఆర్లను, సీడీఎఫ్, పార్ట్-1,2 రిమాండ్ సీడీ, చార్జ్‌షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్లో ప్రతిరోజు ఎంటర్ చేయాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లను పచ్చదనం, పరిశుభ్రతతో అహ్లాదకర వాతావరణంలో ఉంచినందుకు ఎస్సై రంగకృష్ణ, సిబ్బందిని అభినందించారు. సీపీ వెంట గజ్వేల్ ఏసీపీ రమేశ్, రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ములుగు ఎస్సై రంగకృష్ణ, ఏఎస్సైలు శంకర్, నాగేశ్వరరావు, శివకుమార్, ప్రేమ్‌రాజ్, అండాలు, హెడ్ కానిస్టేబుళ్లు, రవీందర్‌రెడ్డి, శేఖర్, సలీం, అంజయ్య, రాంబాబు, మధుసూదన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.