మొదట ఉద్యమకారుడు.. తర్వాత రాష్ట్ర నాయకుడు.. ఇప్పుడు దేశ్ కా నేత.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సీఎం కేసీఆర్ పేరు తెలియని వారుండరు. 1985 నుంచి అప్రతిహత విజయాలు ఎన్నో సొంతం చేసుకున్నారు ఆయన. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలుపొందడం అంటే ఆషామాషి విషయం కాదు. 2001 నుంచి 2014 వరకు రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. స్వరాష్ట్రంలో సీఎంగా అభివృద్ధి, సంక్షేమ పాలన చేస్తూ రాష్ర్టాన్ని ముందు వరుసలో ఉంచారు. ఇప్పుడు దేశం కోసం బయలు దేరారు.. ఆయన బీఆర్ఎస్తో దేశంలో సత్తా చాటుతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిండు మనసుతో మెతుకు సీమ ప్రజలు దీవిస్తున్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 07(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు. పాఠశాల స్థాయి నుంచే రాజకీయాల్లో ఆయన అమితాసక్తి కనకబర్చారు. అప్పట్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాల్గొని విజయాలు సాధించారు. కేసీఆర్ విద్యార్థి దశలోనే 15 నుంచి 20మంది మిత్రులను వెంటబెట్టుకుని అప్పట్లోనే లీడర్షిప్ చేసేవారు. స్నేహితుల ఇండ్లలో శుభకార్యాలు జరిగితే ఆయన నేతృత్వంలో అందరూ కలిసికట్టుగా వెళ్లేవారు. ఎక్కడికీ వెళ్లినా సమయం దొరికందంటే వివిధ అంశాలపై తోటి స్నేహితులతో కేసీఆర్ లోతుగా విశ్లేషించేవారు. ఇది గమనించిన అప్పటి మంత్రి మదన్మోహన్ కేసీఆర్ దగ్గరకు పిలిచి రాష్ట్ర యువజన కాంగ్రెస్ పదవిని అప్పగించారు.
ఈ రకంగా కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో టీడీపీ తరపున కేసీఆర్ పోటీచేసి తన రాజకీయ గురువైన మదన్మోహన్ చేతిలో కేవలం 879 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం మధ్యంతర ఎన్నికల్లో 1985లో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్‌రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు. అప్పటి నుంచి కేసీఆర్ ప్రస్థానం ఆరంభమైంది. ఆ తర్వాత ఆయనకు ఓటమి అంటే తెలియదు. ఎక్కడ పోటీచేసినా విజయలక్ష్మి వరించింది. 1985లో టీడీపీ తరపున 16,156 ఓట్ల మెజార్టీ, 1989లో 13,816 ఓట్ల మెజార్టీ, 1994లో 27,107 ఓట్ల మెజార్టీ, 1999లో 27,555 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున కేసీఆర్ వరుసగా గెలుపొందారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 58,712 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు. మొత్తం మీద 8 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఎంపీగా కరీంనగర్,మహబూబ్‌నగర్ , మెదక్ (2014లో మెదక్ ఎంపీ స్థానానికి, గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ పోటీచేసి రెండుచోట్ల విజయం సాధించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు). మూడు జిల్లాల నుంచి లోక్‌సభ స్థానాల నుంచి ఆయన ప్రాతనిధ్యం వహించారు. సిద్దిపేట నుంచి ఏడుసార్లు పోటీచేసి ఆరుసార్లు గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో మరోమారు గజ్వేల్ నుంచి గెలిచి రెండోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిద్దిపేట అంటే కేసీఆర్‌కు అమితమైన ప్రేమ. చదువుకున్న కళాశాల అంటే అమితాసక్తి. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పెట్టి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని సబ్బండ వర్గాలు హర్షిస్తున్నాయి. ఆయన ఏది తలపెట్టినా విజయం తథ్యమని ప్రజలు పేర్కొంటున్నారు.
దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ వంటి గొప్పనాయకుడు ఎంతో అవసరం. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు, రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు, బీమా, ఉచిత విద్యుత్, తాగు నీరు వంటి ఎన్నో పథకాలను అందించి రైతులు, తెలంగాణ ప్రజలకు అండగా నిలిచారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు కావాలంటే సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరమున్నది.
-అయిత వెంకటలక్ష్మి , ఎంపీటీసీ (చేగుంట)
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది. తెలంగాణాను సాధిం చిన కేసీఆర్.. ఇదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోనూ విజయం సాధిస్తారు. దేశ్ కీ నేతగా ఆయనకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు టీఆర్ఎస్ను ఆదరించిన విధం గా దేశమంతా బీఆర్ఎస్ను అదరిస్తుంది.
-ప్రభాకర్‌రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు (రాయికోడ్)
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించి ఇవే తరహా పథకాలను దేశ ప్రజలందరికీ అందిస్తారు. బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ప్రకటన చరిత్రత్మాకం. ఇప్పుడు కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. ప్రజాసంక్షేమం. అభివృద్ధిపై తపన ఉన్న నాయకుడు. దేశ ప్రజలందరికీ మేలు చేయాలన్న సంకల్పంతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఆయనకు యావత్ దేశ ప్రజలు మద్దతు ఉంది.
-సిద్దన్నపాటిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ (రాయికోడ్)
భారత్ రాష్ట్ర సమితి దేశంలో గొప్పమార్పు తీసుకొస్తుంది. ఇంతకు ముందు ఇలా వచ్చి.. అలా కనుమరుగైన జాతీయ పార్టీలు చాలా చూశాం. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న ప్రజారంజక, ప్రజా ఉద్ధారక పనులు అన్ని రాష్ర్టాల్లో అమలు చేయడానికి కేసీఆర్ వద్ద వ్యూహాలున్నాయి. దేశంలో రోజురోజుకూ నెలకొంటున్న రాజకీయ అస్థిరత, మతతత్వ అసహనంతో ప్రస్తుతం దేశ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తూనే కేసీఆర్ లాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లౌకికవాదం బలపడేందుకు తెలంగాణలో అమలవుతున్న రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బతుకమ్మ చీరల పంపిణీ లాంటి సర్వమత సమ్మేళన పథకాలను దేశమంతటా అమలు చేస్తారు. ఇన్నేండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీతో కాని పనులు కేసీఆర్‌తో సాధ్యమవుతాయి. రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు ఇస్తున్న ధూప, దీప నైవేద్యాల ఖర్చులు దేశమంతటా అమలు చేస్తారు. అన్ని కులాలకు నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలు అన్ని రాష్ర్టాల్లో నిర్మిస్తారు. దీనితో దేశంలో కుల, మత వైషమ్యాలు,, మతపర దాడులు జరుగకుండా దేశం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే టీఆర్ఎస్(బీఆర్ఎస్) దేశ రాజకీయాలకు మలుపు అవుతుంది.
– లచ్చగౌని రాములుగౌడ్, నాచారం లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుడు, వర్గల్
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. ప్రస్తుత కాలంలో కేసీఆర్ లాంటి నేత అవసరం దేశానికి ఉంది. సీఎం కేసీఆర్ ముందు చూపున్న నాయకుడు. తెలంగాణ లెక్క దేశంలో సంక్షేమ పథకాలు కావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన కేసీఆర్‌తోనే దేశ మార్పు సాధ్యం.
– మకిలి నవీన్‌కుమార్, మెకానిక్, కొమురవెల్లి