సంగారెడ్డి అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ) : నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ఎమ్మెల్యేలు పాలుపంచుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలుపొంది సత్తా చాటాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టుదలగా ఉన్నది. దీంతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో సమీప జిల్లాలోని ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జిల్లా మంత్రి హరీశ్‌రావుతోపాటు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.
మంత్రి హరీశ్‌రావు మర్రిగూడ మండల ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌కు వేర్వేరు గ్రామాలకు ఇన్చార్జిలుగా నియమించారు. కాంగ్రెస్, బీజేపీ చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టి ఓటర్లను టీఆర్ఎస్(బీఆర్ఎస్) వైపు మళ్లించేలా ఎమ్మెల్యేలు తమ బృందంతో పనిచేయనున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), చంటి క్రాంతికిరణ్(అందోలు), మాణిక్‌రావు(జహీరాబాద్), భూపాల్‌రెడ్డి(నారాయణఖేడ్)తోపాటు మాజీ ఎమ్మెల్యే, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ మునుగోడు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు.
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 1, 13వ వార్డు బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 11, 12 వార్డుల ఎన్నికల ఇన్చార్జిగా నియమించారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌కు చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం, అంకిరెడ్డిగూడెం గ్రామాల బాధ్యతలు అప్పగించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు నారాయణపూర్ మండలంలోని వాయిలపల్లె గ్రామ ఇన్చార్జిగా నియమించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని చౌటుప్పల్ మండలం నేలపట్ల, కుంట్లగూడెం గ్రామాల ఇన్చార్జిగా నియమించారు.
నారాయణఖేడ్, అక్టోబర్ 7: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శుక్రవారం మునుగోడు ప్రచారానికి బయలుదేరి వెళ్లిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం నేలపట్ల, కుంట్లగూడెం గ్రామాలకు తనను ఇన్చార్జిగా నియమించారన్నారు. ఆయా గ్రామాల్లో ప్రచార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు అత్యధిక ఓట్లు పోల య్యే విధంగా ప్రయత్నిస్తానన్నారు. తనతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన మండలస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున మునుగోడు ప్రచారానికి తరలి వెళ్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి, అక్టోబర్ 7 : మునుగోడు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్నికల వాతావరణం నెలకొన్నది. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ నాయకత్వంలో నాయకులు తరలివెళ్లారు. నేటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎవరికి వారు పార్టీల వారిగా గ్రామాలు, మండలాలకు ఇన్చార్జిలను నియమించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి నుంచి 25 మందికి పైగా (టీఆర్ఎస్) బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లి వారికి కేటాయించిన గ్రామాలు, పట్టణంలోని వార్డుల్లో పర్యటించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కొండాపూర్ ఎంపీపీ మనోజ్‌రెడ్డి, సర్పంచ్ మోహన్ సింగ్ నాయక్, సంగారెడ్డి మండ లాధ్యక్షుడు చక్రపాణి, నాయకులు కాసాల రాంరెడ్డి, మనోహర్‌గౌడ్, పండల పాండురంగం, మల్లేశం, అనంతరెడ్డి, జలేంధర్ ఉన్నారు.
గెలుపుపై ధీమా..
కోహీర్, అక్టోబర్ 7 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిని గెలిపిస్తాయని ఎమ్మెల్యే మాణిక్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులతో కలిసి కవేలి 65వ జాతీయ రహదారి గుండా మునుగోడుకు బయలుదేరారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే నెల 3న నిర్వహించే మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ జిల్లా సభ్యుడు బంటు రామకృష్ణ, మండలాధ్యక్షుడు నర్సింహులు, సుభాశ్‌రెడ్డి తదిత రులు ఉన్నారు.
పటాన్చెరు, అక్టోబర్ 7 : నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలవడం ఖాయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం పటాన్చెరు నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది నేతలు మునుగోడు ఉప ఎన్నికలకు తరలివెళ్లారు. మునుగోడు అసెంబ్లీ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో 1వ, 13వ వార్డులకు ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించారు. చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) శ్రేణులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒకటో వార్డులో ఎమ్మెల్యే ప్రచారం ప్రారంభించారు. అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట స్థానిక నేతలు ఉన్నారు.