సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 7: జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ పేర్కొన్నారు. జిల్లాలో అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ హక్కులు, చట్టాలు, ఆయా అధికారులు, కమిటీల పాత్ర, బాధ్యతలు, పోడు భూముల సర్వే, మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయడంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం నిబంధనల మేరకు పోడు భూములు సాగు చేస్తున్న వారికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. 2005 డిసెంబర్ 13కు ముందు నుంచి భూముల్లో ఉన్నవారు అర్హులని తెలిపారు. పోడు భూముల సర్వే దరఖాస్తుదారుల వివరాలు అప్లోడ్ తదితరాల ప్రక్రియ కసరత్తు వేగవంతం చేయాలని సూచించారు. ప్రాపర్‌గా వెరిఫికేషన్ చేయాలని, తిరస్కరిస్తే దానికి గల కారణాలు లిఖితపూర్వకంగా ఉండాలని తెలిపారు. అధికారులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.
జిల్లాలోని 52 గ్రామ పంచాయతీలలోని 72 ఆవాస ప్రాంతాలలో 7,109 ఎకరాలకు సంబంధించి 3,934 క్లెయిమ్‌లు వచ్చాయని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, అటవీ శాఖలు సమన్వయం చేసుకుంటూ ఎంపీడీవోలు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, 2005 కంటే ముందు నుంచి పోడు భూముల సాగు చేస్తున్న గిరిజనులను, మూడు తరాల (75 సంవత్సరాలు) నుంచి పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్ లను గ్రామ స్థాయి కమిటీ, క్షేత్ర స్థాయి క్లెయిందారు సమక్షంలో సర్వే చేయాలని సూచించారు.
ఆయా స్థాయి కమిటీల్లో తీర్మానాలను రిజిష్టర్లలో పక్కగా నమోదు చేయాలని పేర్కొన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు క్షేత్ర పర్యటనకు వెళ్లినపుడు ఎఫ్ఆర్సీ కమిటీకి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. రిజిష్టర్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్ అధికారి క్షేత్ర సర్వే బృందం ప్రతి దరఖాస్తును పరిశీలించి మొబైల్ యాప్‌లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ పంచాయతీల వారిగా దరఖాస్తులను పరిశీలించేందుకు కార్యాచరణ రూపొందించి, తేదీలను నిర్ణయించి సర్వే పనులు వెంటనే ప్రారంభించాలని వివరించారు. సర్వే తేదీలను ముందుగానే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు.
అయితే దరఖాస్తుదారులు తమ వద్దగల పూర్తి ఆధారాలతో ఆ రోజు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆయా గ్రామాలలో ముందు రోజు టామ్ టామ్ ద్వారా తెలియజేయాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు, ఫారెస్ట్ రేంజ్ అధికారులతో టైఅప్ చేసుకొని నిర్దేశించిన ప్రొఫార్మా మేరకు డిజిటల్ సర్వే నిర్వహించి, గ్రామాల నుంచి తీర్మానాలు పంపాలని తెలిపారు. డివిజనల్ పంచాయతీ అధికారులు ఎప్పటికపుడు సర్వేపై పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎఫ్ఆర్సీ కమిటీని సర్వేలో భాగస్వాములను చేయాలని సూచించారు. వెరిఫికేషన్ జాప్యం చేయరాదని అన్నారు.
సర్వే సందర్భంలో ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుదారుల దగ్గర నుంచి సేకరించాలని, కనీసం రెండు ధ్రువపత్రాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అటవీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా పని చేయాలని, పనులు పూర్తయ్యే వరకు హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని సూచించారు. మొబైల్ యాప్‌లో సర్వే చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి మోహన్‌రావు, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఫిరంగి, రెవెన్యూ డివిజన్ అధికారులు, అటవీ శాఖ అధికారులు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.