సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 3: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ శరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి తరలివచ్చారు. కలెక్టర్కు అర్జీలు అందజేసి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వాటిని విచారించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిషరించాలని మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఆయన మాట్లాడుతూ ఒక అర్జీ కూడా పెండింగ్ ఉండకుండా, పరిశీలించి పరిషరించాలన్నారు. కొల్చారం మండలం రాంపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న పాత రోడ్డును సర్పంచ్ అన్యాక్రాంతం చేస్తున్నారని, తగు చర్య తీసుకోవాలని మాచవరం గ్రామానికి చెందిన కిషోర్ తదితరులు ఫిర్యాదు చేశారు. మెదక్లో డంపింగ్ యార్డును జేసీబీలతో చదును చేసినందుకు అయినా ఖర్చు రూ.5.17లక్షలు ఇప్పించాలని సిద్దిరాములు ఎర్త్ మూవర్స్ వారు అభ్యర్థించారు. తాను సాగుచేసుకుంటున్న 6.8 ఎకరాల భూమి ధరణి పోర్టల్లో నిషేధిత జాబితాలో ఉన్నదని, దాన్ని తొలగించాల్సిందిగా కౌడిపల్లి మండలం తునికీకి చెందిన రథ్లా దుర్గ్యా కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి, మైనారిటీ అధికారి జెంలా, డీఎంహెచ్వో విజయనిర్మల తదితర అధికారులు పాల్గొన్నారు.