‘తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది.. ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా ఉద్యోగులకు 73శాతం ఫిట్మెంట్ ఇచ్చింది.. రాష్ట్ర సర్కారు విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నది.. బడ్జెట్లో 11శాతం నిధులు ఖర్చు చేస్తున్నది’.. అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేటలో జరిగిన ఎస్టీయూ 75వ వసంతోత్సవం, బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం, యువజన విభాగం సమావేశంతో పాటు పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, బీజేపీ సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని మనమంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 29 : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) వజ్రోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొని, మాట్లాడారు. ఎస్టీయూ 75వ వసంతోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో టీచర్లతో ప్రభుత్వం ఎంత స్నేహ పూర్వకంగా ఉందో గమనించాలన్నారు. 73శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు.
చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా ఇంత ఫిట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఇతర రాష్ర్టాల ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా తెలంగాణ ఉపాధ్యాయుల వేతనమే అధికంగా ఉందన్నారు. గతంలో డీఈవోను కలవాలంటే సంగారెడ్డికి పోయే పరిస్థితి ఉండేదని, కానీ, సిద్దిపేట జిల్లా ఏర్పడడంతో అక్కడికి వెళ్లే బాధ తప్పిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లయినా ఎవరూ చేయని విధంగా ఇంటింటికీ నీళ్లిచ్చిన ఒకేఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు అని అన్నారు. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిందని, మీరు ఇతర రాష్ర్టాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. కరెంటు, మంచి నీరు సమస్య లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నడవకపోయేదని, కానీ ఈ ఎనిమిదేళ్లలో ఏనాడైనా కరెంటు, నీళ్ల సమస్యపై అడిగారా? అని ప్రశ్నించారు. ఏడేండ్ల కింద పల్లెలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? గమనించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై 11శాతం ఖర్చు పెడుతున్నదని, అన్ని లెక్కలను తాను చూపిస్తానని మంత్రి పేర్కొన్నారు. నాడు 2014లో రూ.300 కోట్లు ఖర్చు పెడితే, నేడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెసిడెన్షియల్ పాఠశాలల మీద రూ.3,300 కోట్లు ఖర్చు పెడుతున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 248 రెసిడెన్షియల్ పాఠశాలుంటే, అందులో లక్షా 24వేల మంది విద్యార్థులు చదివే వారని, కానీ, నేడు తెలంగాణలో 923 రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నామని, 4.5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 50మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చి మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో ఐదు కాలేజీలుంటే, సీఎం కేసీఆర్ నేతృత్వంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘మనఊరు-మనబడి’తో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా చర్యలు వేగంగా ప్రారంభించినట్లు తెలిపారు.
అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి ప్రవేశపెడుతున్నదన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఆపుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పథకాలను తమకు ప్రవేశపెట్టారని, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగినట్లు ఆయన తెలిపారు. నాడు పని దొరకక ముంబై, దుబాయి వెళ్లిన రైతులు, నేడు జిల్లాలో 5 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే పరిస్థితికి చేరుకున్నారన్నారు. తెచ్చిన అప్పులను క్రమం తప్పకుండా కడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సంపద సృష్టిలో కూడా నెంబర్ వన్‌గా ఉందన్నారు.
ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణ పథకాలు అడుగుతుంటే, ఓర్వలేక తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మట్టపల్లి రంగారావు, రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందగౌడ్, రాష్ట్ర నాయకులు భుజంగరావు, ఇతర ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.