సిద్దిపేట, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మన రాష్ట్రంలో జరుపుకొనే బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. వ్యవసాయాధారమైన తెలంగాణ ప్రజలు ఎన్ని కరువు కాటకాలు, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా తమ ఊపిరిలో ఊపిరిగా, తమ జీవన స్థితిగతులను, కష్టసుఖాలను కలబోసి జరుపుకొనే పండుగ బతుకమ్మ. బతుకమ్మను బతుకునిచ్చే తల్లిగా తెలంగాణ మహిళలు కొలిస్తే, బొడ్డెమ్మను కన్నెపిల్లలు, బాలికలు పూజిస్తారు. పెత్తరమాస రోజైన(ఆదివారం) నుంచి తొమ్మిది రోజుల వరకు పూల బతుకమ్మను పేర్చి ఆడతారు. వెడల్పైన పల్లెంలో గుమ్మిడాకులు పరి చి, వాటి మీద తంగేడు పూలు, గునుగ పూలు, బంతిపూలు, చామంతిపూలు ఇలా తీరొక్కపూలతో పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు.
తెలంగాణ సంస్కృ తి వైభవానికి ప్రతీక. ఇది ఆడపడుచుల పండుగ, సాయంత్రం అయ్యేసరికి, పట్టు చీరలు, మెడలో నగలతో ముస్తాబై పూలతో పేర్చిన బతుకమ్మను ప్రధాన కూడళ్లలో విశాలమైన ప్రదేశం లో పెట్టి సద్దుల బతుకమ్మ వరకు సాయంత్రం వేళ గాజుల గలగల వాయిద్యాలుగా మలచి, పల్లవికి శృతి కలుపుతూ లయబద్ధ్దంగా అడుగులు వేస్తూ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. కలవారి కోడ లు ఉయ్యాలో.. కలికి కామాక్షి ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ ఆడు తూ పాటలు లయబద్ధంగా పాడుతూ ఉంటారు.
బతుకమ్మ రూపం ఇలా..
వెదురు ఈనెలతో చేసిన సిబ్బినిలోగానీ.. ప్లేట్లు లేదా తంబాలంలో గానీ, బతుకమ్మను పేరుస్తారు. కింద గుమ్మడి లేదా బీర ఆకులను పరిచిన అనంతరం తంగేడు పూలను పేరుస్తారు. అనంతరం గును గు, గడ్డి, చామంతి తదితర తీరొక్క పూలతో శంకు ఆకారంలో పేరుస్తుంటారు. ఇలా పేర్చిన బతుకమ్మను పూజగది ముందు ఉంచుతా రు. సాయంత్రం వేళలో గ్రామచావిడీలు, గల్లీల వద్ద పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటారు. ఇలా ఆడిన తర్వాత బతుకమ్మను తీసుకుని చెరువు గట్టు వద్దకు పాటలు పాడుతూ వెళ్లి, మళ్లీ చెరువు గట్టు దగ్గర ఆడుతుంటారు. ఆడిన అనంతరం నిమజ్జనం చేస్తారు.
ఎంగిలి పూలరోజు, సద్దుల బతుకమ్మ రోజు తయారు చేసిన గౌరమ్మను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. సద్దుల బతుకమ్మ పండుగ రోజున బతుకమ్మ ఆడే ప్రధాన కూడలి వద్ద వెంపల్లి చెట్టు కొమ్మను నాటి పసుపు, కుంకుమలు చల్లుతారు. బతుకమ్మ మొదటి రోజు ఎంగిలిపూలు అంటారు. పెత్తరమాస రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ రోజుల్లో రోజొక్క తీరు ఫలహారాలను తీసుకెళ్లి బతుకమ్మ చెరువులో నిమజ్జనం చేసిన అనంతరం ఫలహారాలను స్వీకరిస్తారు.
తొమ్మిది రూపాల్లో బతుకమ్మ
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలతో కొలుచుకోవడం తెలంగాణ ప్రజల ఆనవాయితీ.
1. ఎంగిలిపూల బతుకమ్మ
బతుకమ్మ నవరాత్రుల్లో మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. బతుకమ్మను పేర్చడానికి వాడే పూలు ఒకరోజు ముందే తెంపుకొచ్చి అవి వాడిపోకుండా నీళ్లలో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు. మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అంటారు.
2.అటుకుల బతుకమ్మ
రెండో రోజు ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డిపూలు తీసుకు వస్తారు. ఈ పూలను రెండు ఎత్తులతో గౌరమ్మను పేర్చి ఆడవారందరు కలిసి ఆడుకొని సాయంత్రం చెరువులో వేస్తారు. అటుకులు వాయినంగా పెడుతారు.
3.ముద్దపప్పు బతుకమ్మ
మూడోరోజు బతుకమ్మను మూడంతరాల్లో చామంతి, మందారం తదితర పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. వాయినంగా సత్తుపిండి, పెసర్లు, చక్కెర, బెల్లం కలిపి పెడతారు.
4.నాన బియ్యం బతుకమ్మ
నాలుగో రోజు నానబియ్యంగా పలహారం పెడుతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగు అంతరాల బతుకమ్మను పేర్చుతారు. నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ, చక్కెరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడుతారు.
5.అట్ల బతుకమ్మ
ఐదో రోజు తంగేడు, గునుగు, చామంతి తదితర పూలతో ఐదంతరాలుగా బతుకమ్మను పేర్చుతారు. వాయినంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.
6. అలిగిన బతుకమ్మ
ఆదో రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను పేర్వరు. పూర్వకాలంలో బతుకమ్మ పేర్చే సమయంలో మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరో రోజు బతుకమ్మను ఆడరు.
7. వేపకాయల బతుకమ్మ
వివిధ పూలతో ఏడో రోజు బతుకమ్మను ఏడంతరాలుగా పేర్చుతారు. వాయినంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడుతారు లేదా పప్పుబెల్లం నైవేద్యంగా పెడుతారు.
8. వెన్నెముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు వివిధ రకాల పూలతో ఎనిమిది అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడుతారు. ఈ రోజు వాయినంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు.
9. సద్దుల బతుకమ్మ
పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. చిన్న బతుకమ్మ పేర్చి గౌరమ్మను పెడతారు. సద్దులు తీసుకెళ్లి చెరువు గట్టు వద్ద బతుకమ్మ ఆడిన అనంతరం వాయినాలు ఇచ్చుకొని సద్దులను కుటుంబీకులతో కలిసి భుజిస్తారు.