సిద్దిపేట, సెప్టెంబర్ 17 : ఎల్కతుర్తి-మెదక్ వరకు జాతీయ రహదారి -765 డీజీ, జనగాం-సిరిసిల్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేయాలని అధికారులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ డీఈ మోహన్, ఆర్డీవో అనంతరెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి ఎల్కతుర్తి-మెదక్ రహదారి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హనుమకొండ, సిద్దిపేట మెదక్ జిల్లాల మీదుగా 137.6 కిలో మీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించారన్నారు. వీటిలో ఒకటి సిద్దిపేట నుంచి మెదక్ వరకు(69కిలో మీటర్లు), రెండోది ఎల్కతుర్తి -సిద్దిపేట(64 కిలో మీటర్లు) ఉందన్నారు. జిల్లాలో 80 కిలో మీటర్ల మేర నేషనల్ హైవే, జనగామ నుంచి చేర్యాల మీదుగా సిరిసిల్ల వరకు 105 కిలోమీటర్లు మరో నేషనల్ హైవేనిర్మాణ అంశాలపై చర్చించారు. దసరా పండుగ మొదటి వారంలో పనులు ప్రారంభించి, ఏడాదిన్నరలోపు పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు.
ఆర్అండ్బీ, ఫారెస్ట్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, రైల్వే శాఖల సమన్వయంతో ఎలాంటి సమస్యలకు తావువివ్వకుండా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌తో సమావేశమై, హుస్నాబాద్ మీదుగా వెళ్లే రోడ్డు మార్గంలో డ్రైనేజీ సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు ప్రణాళికతో నిర్మాణ పనులు చేపట్టాలని సూచనలు చేశారు. రెండో ప్యాకేజీలో ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు నిర్మాణం చేసే రోడ్డుకు మిట్టపల్లి ముండ్రాయి, పాలమాకుల, బద్దిపడగ, బస్వాపూర్, సముద్రాల, పందిళ్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్), జిల్లెల్లగడ్డ, కొత్తపల్లి ఇందిరానగర్ వరకు రోడ్డు రానున్నదన్నారు. ఈ మార్గంలో 22కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, 42కిలో మీటర్ల మేర రెండు వరుసల రహదారి, రంగధాంపల్లి నుంచి పాలమాకుల వరకు 10కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తారన్నారు. సిద్దిపేట ఎన్సాన్పల్లి వర్కిల్ నుంచి అండర్‌పాస్ సబ్వే ద్వారా రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి తిమ్మాపూర్ వరకు 12 కిలో మీటర్లు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారని చెప్పారు.
పలు చోట్ల హైలెవల్..అండర్‌పాస్.. సబ్వే బ్రిడ్జిలు
రహదారి నిర్మాణంలో భాగంగా బస్వాపూర్, పందిల్ల వద్ద పాత బ్రిడ్జిల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిలు, అవసరమున్న చోట అండర్ పాస్ బ్రిడ్జిలతో పాటు 26 చోట్ల మైనర్ బ్రిడ్జిలు, 29 పైప్ కల్వర్టులు, రెండు బాక్స్ కల్వర్టుల పునర్నిర్మాణంతో పాటు ఒక మైనర్ బ్రిడ్జి, మేజర్ బ్రిడ్జి, రెండు పైపుల కల్వర్టులు, 11 బాక్స్ కల్వర్టులు కొత్తగా నిర్మించనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. హైలెవల్, అండర్ పాస్ బ్రిడ్జి, రోడ్డు మీదుగా జంక్షన్ల అభివృద్ధి, ఎల్కతుర్తి వద్ద మేజర్ జంక్షన్, ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు 28 చోట్ల మైనర్ జంక్షన్లు రానున్నట్లు తెలిపారు. ఇతర ప్రాజెక్టు అంశాలపై చర్చిస్తూ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులకు ఆటంకాలు లేకుండా పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు.
సిద్దిపేటలో 50 పడకల ఆయుష్ దవాఖాన
సిద్దిపేటలో 50 పడకల ఆయుష్దవాఖాన నిర్మాణానికి కావాల్సిన టెండర్లు త్వరితగతిన పూర్తి చేసి, శంకుస్థాపనకు సిద్ధం చేయాలని వైద్య ఇంజినీర్లను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మెడికల్ కళాశాల సమీపంలోనే సెంట్రల్ డ్రగ్ స్టోర్ కోసం రెండు రోజుల్లో స్థలాన్ని పరిశీలించి వీలైనంత తొందరగా వైద్య శాఖకు అప్పగించాలని రెవెన్యూ అధికారులకు మంత్రి సూచించారు. సమీక్షలో మున్సిపల్ చైర్పర్సన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సిద్దిపేట సమీకృత మార్కెట్లో ఎల్ఈడీ స్క్రీన్ ప్రారంభం
సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 17 : సిద్దిపేట సమీకృత మార్కెట్లో ఎల్ఈడీ స్క్రీన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడంపై మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజితను మంత్రి అభినందించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు కూరగాయల ధరలు, ప్లాస్టిక్‌పై అవగాహన, నాన్ వెజ్‌కు టిఫిన్ బాక్స్, కూరగాయలకు జూట్ బ్యాగులు తెచ్చుకునేలా.. స్వచ్ఛ సిద్దిపేట, అభివృద్ధి సిద్దిపేట, పరిశుభ్రత పై అవగాహన కల్పించే ఈ స్క్రీన్‌లో వీడియో ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్‌రావు, మోహన్‌లాల్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో వర్కింగ్ ఉమెన్స్ భవన్.. వృద్ధాశ్రమం
జిల్లా కేంద్రం సిద్దిపేటలో వర్కింగ్ ఉమెన్స్ భవన్, వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, ఆర్డీవో, తహసీల్దార్, డీఎంహెచ్‌వో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతి అంశాలపై సమీక్షించారు. సిద్దిపేటకు వర్కింగ్ ఉమెన్స్ భవన్ మంజూరు చేసుకున్నామని, ఇందు కోసం మహిళా భవన సముదాయాలు ఒకే చోట ఉండేలా అర్బన్ ప్రాంతంలో అనువైన స్థలాన్ని అన్వేషించాలని ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. కొండపాకలోని ఆనంద నిలయం పరిశీలించి, అదే తరహాలో సిద్దిపేట వృద్ధాశ్రమం మోడల్‌గా నిలిచేలా నిర్మించాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య, మహిళా ప్రాంగణం, సఖీ- భరోసా కేంద్ర భవన ప్రగతి అంశాలపై అధికారులను ఆరా తీశారు.