మెదక్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు మెదక్ జిల్లా సిద్ధమైంది. వేడుకలు వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు రోజుల పాటు కొనసాగే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్ ఎప్పటికప్పుడు సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు అయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
30వేల మందితో ర్యాలీలు, సభలు..
మెదక్ జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో సభను ఏర్పా టు చేశారు. మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు ర్యాలీ ప్రారంభం కానున్నది.
ఈ ర్యాలీలో 50వేల పెద్ద జాతీయ పతాకాలు, 10వేల చిన్న పతాకాలు చేతబూని పట్టణంలోని రాందాస్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్కు, పొస్టాఫీస్ మీదుగా జూనియర్ కళాశాల మైదానానికి ర్యాలీ చేరుకుంటుంది. జాతీయ సమైక్యతను చాటిచెప్పే పాటలతో డీజేసౌండ్ ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో పాల్గొంటారు. మెదక్ నియోజకవర్గంలోని మెదక్ మండలం, హవేళీఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట్ మండలాల నుంచి 15వేల మంది రానున్నారు.
ఈ నేపథ్యంలో సభాస్థలి వద్ద షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. సభ ముగిసిన తర్వాత భోజనాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నర్సాపూర్‌లోని అటవీ శాఖ కార్యాలయం నుంచి అల్లూరి సీతారామ రాజు గురుకుల పాఠశాల వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, నర్సాపూర్, వెల్దుర్తి మండలాలకు చెందిన 15వేల మంది పాల్గొననున్నారు.
17న మెదక్ కలెక్టరేట్లో వేడుకలకు మంత్రి తలసాని..
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9గంటలకు మెదక్ కలెక్టరేట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలనుద్ధేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం జాతీయ సమైక్యతపై బాల బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తేనేటి విందుతో కార్యక్రమం ముగుస్తుంది. అదే రోజు హైదరాబాద్‌లో ఆదివాసీ గిరిజన సమ్మేళనానికి మెదక్ జిల్లా నుంచి ఎస్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘ సభ్యులు వెళ్లడానికి ఆయా మండలాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
స్వాతంత్య్ర సమరయోధులకు, కళాకారులకు సన్మానం
వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మెదక్‌లోని ద్వారకా గార్డెన్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మాన కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ ఆధ్వర్యంలో కొనసాగనున్నది.
విజయవంతం చేయాలి
అందోల్, సెప్టెంబర్ 15: వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శరత్ అన్నారు. గురువారం జోగిపేటలో ఎస్పీ రమణకుమార్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16వ తేదీ నుంచి 18వరకు వేడుకలు ఘనంగా నిర్వహించాల న్నారు. నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించాలన్నారు. జెండావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సభల నిర్వహణలో ఏర్పాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేసి విజయవంతం చేయాలని కోరారు. వారి వెంట అదనపు కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ అశ్రిత్‌కుమార్, పీఆర్ ఏఈ పాల్గొన్నారు.