మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 14: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు.
16న నిర్వహించే ర్యాలీ, సభకు అన్ని నియోజకవర్గాల్లో కలెక్టర్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అధిక సంఖ్యలో కౌంటర్లను మండలాల వారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండానను ఎగురవేయాలన్నారు.
హైదరాబాద్‌లో జరిగే ఆదివాసీ, బంజారా భవన్ల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్దఎత్తున గిరిజనులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, అదే రోజు స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మానాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాలన్నీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా నిర్వహించేలా జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తదనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను కోరారు.
మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మెదక్ కలెక్టర్ హరీశ్ అక్కడి నుంచే సమీక్షలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ 16న జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని ర్యాలీ విజయవంతం చేస్తామని అన్నారు. ర్యాలీ అనంతరం భోజనం ఏర్పాట్లు కోసం అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17న జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ఆ రోజు ఉదయం జిల్లా నుంచి ఎస్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృంద సభ్యులను హైదరాబాద్‌కు తరలిస్తామని తెలిపారు. 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
కార్యక్రమంలో మెదక్ నుంచి ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జడ్పీ సీఈవో శైలేశ్, ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు, డీటీవో శ్రీనివాస్‌గౌడ్, డీఈవో రమేశ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీఎస్వో శ్రీనివాస్, యువజన సంక్షేమాధికారి నాగరాజ్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.