మెదక్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం కలెక్టర్ హరీశ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలతో పాటు అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ నాలుగైదు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లలో చెక్ డ్యాంలు ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎక్కడ నుంచి నీటి ప్రవాహం వస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన 08452-223360 నెంబర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులు, వర్షపాతం వివరాలను తెలియజేయాలని, ఎక్కడైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లు, ఇతర భవనాలు ఉంటే గుర్తించాలని ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే సిబ్బందిని పంపించి వెంటనే పరిష్కరించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు, స్తంభాలు, కరెంటు వైర్లను సిబ్బంది పరిశీలించేలా చూడాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తమ సేవలను అందించేలా సిద్ధంగా ఉండాలని తెలిపారు. తాగునీరందించే విషయంలో కలుషిత నీరు రాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పోలీసు యంత్రాంగం ఎక్కడైనా ఇబ్బందికర సంఘటనలు జరిగితే వెంటనే చేరుకుని, సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలన్నారు. రేషన్ దుకాణాలకు సంబంధించి బియ్యం ముందుగానే స్టాక్ పాయింట్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా జిల్లా అధికారులకు సహకరించాలని, ఇబ్బందులు ఉంటే వెంట నే అధికారులు, పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సమావేశంలో కలెక్టర్ ఎస్.హరీశ్, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీపీవో తరుణ్‌కుమార్, డీఎస్వో శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఎస్ఈ జానకిరాములు, నీటి పారుదల, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ శాఖల అధికారులు, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు సాయిరాం, వెంకట ఉపేందర్‌రెడ్డి, శ్యాంప్రకాశ్, మెదక్ డీఎస్పీ సైదులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా ప్రత్యేకాధికారిగా నియమించిన ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్ సోమవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఇతర జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆయా శాఖల ముందస్తు ప్రణాళిక, కంట్రోల్ రూం ఏర్పాటు, వర్షపాత వివరాలు, పంటలు, ఆస్తినష్టం తదితర విషయాలపై ఆరా తీశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో అధికారులందరినీ అప్రమత్తం చేశామని, ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని, ఇప్పటివరకు పంటలు ఏవీ దెబ్బతినలేదని ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ ప్రత్యేక అధికారికి వివరించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో వెళ్తున్నారని తెలిపారు.
రానున్న మూడు రోజులు వర్షాలు
సమావేశంలో రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ మరో మూడు రోజుల పాటు వర్షప్రభావం ఉంటుందని ఆర్అండ్బీ, విద్యుత్, నీటి పారుదల, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిషన్ కాకతీయ చెరువుల వివరాలు, సింగూర్ ఇన్‌ఫ్లో వివరాలను నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యామ్‌ల వద్దకు ఎవరినీ అనుమతించవద్దని, అన్ని ఫిర్యాదులు కలెక్టరేట్‌కు అందేలా ప్రస్తుతం ఉన్న కంట్రోల్ రూంను, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంగా ఏర్పాటు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వెంటనే స్టాక్ పంపేలా ఏర్పాటు చేసుకోవాలని పౌర సరఫరాల అధికారులకు సూచించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
అత్యవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భవనాలను గుర్తించాలని, ఆ మేరకు ప్రణాళిక రూ పొందించాలని ఆర్డీవోలకు ప్రత్యేకాధికారి రోనాల్డ్‌రోస్ సూ చించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, లైన్మెన్లతో సహా అందరూ క్షేత్ర స్థాయిలో ఉండాలని స్పష్టం చే శారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ బాగుండాలని, తాగునీరు, శుద్ధిని పరీక్ష చేయించాలన్నారు. ప్రతి గ్రా మ పంచాయతీలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి తెలిపారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంల వద్ద అవసరమైన మందులు అందుబాటులో ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌వోకు సూచించారు. అంగన్వాడీ పిల్లలకు వారి ఇంటి వద్దకు వెళ్లి ఆహారం అందించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లలో నీళ్లు నిలిస్తే తోడివేయడానికి మోటార్లు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను రోనాల్డ్‌రోస్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో రా ధికా రమణి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.