అన్నవరం దేవేందర్ తెలంగాణ మట్టికవి..
ధిక్కారమనే తత్వాన్ని అక్షరాలుగా అల్లుకొని.. కథలు, కవితల సాహిత్యకారుడిగా మారాడు. చరిత్రను రెండు మాటల్లో చెప్పగలిగే అమోఘమైన వ్యక్తి. తెలంగాణను అవసాన పట్టినట్లు కవితలు, రచనలు ఆవిష్కరిస్తున్నారు. కష్టాలు.. కన్నీళ్లు, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ముఖ్యంగా పల్లె జీవిన సౌందర్యం ఆయన కవితా రచనలో ఉట్టి పడుతుంది. కష్టజీవులు రాల్చె చెమట చుక్కలను ఆయన అక్షరాలు మనకు పరిచయం చేస్తాయి. తెలంగాణ జీవనాన్ని కాన్వాస్‌గా చూపిన
కవిగా చెప్పవచ్చు.
హుస్నాబాద్‌టౌన్, జూలై 20 : బాల్యం.. ఇసుకలో కసికదాచుకున్న జ్ఞానం.. బాపమ్మ.. తాత మాట్లాడుకునే భాష.. బాల్యం.. బాలశిక్షలో దాచుకున్న నెమలికన్నులాగా.. ఆయన కవితలు కండ్లముందే జరిగినట్టు కనిపిస్తాయి. మనుషులు మాట్లాడుకునే భాష తప్ప కృతిమత్వంతో ఆయన కవితలు మనకు కనిపించవు. సహజత్వంలో మనకు పల్లె కనిపిస్తుంది.. బతుకుచూపిస్తుంది.. అంతా కండ్లముందు జరుగుతున్నట్లే అగుపిస్తుంది. అలా కవితలకు జీవం పోస్తున్నాడు ఈ అన్నవరం దేవేందర్. హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామానికి చెందిన అన్నవరం దేవేందర్ విద్యార్థి దశ నుంచే కవిత్వాలు రాయడం ప్రారంభించగా, నాలుగు దశబ్దాలుగా ఆయన కలం నుంచి కవితా ధారలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. నాటి, నేటి, భవిష్యత్ సమాజపు పోకడలను సమాజం ముందుంచుతూ అందరి మెదళ్లలో కదలికలు తెప్పిస్తున్నాడు ఈ కవి, రచయిత అన్నవరం దేవేందర్.
మాస్టారు మాట.. అదే దేవేందర్ బాట..
హుస్నాబాద్‌లో ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న రోజుల్లో తెలుగు మాస్టారు నారాయణరెడ్డి వేసవి సెలవుల్లో మీరు మహాప్రస్థానం, గబ్బిలం, గుర్రంజాషువా పుస్తకాలను చదవాలని సూచించారు.. దీంతో ఆయన గ్రంథాలయానికి వెళ్లి, మహాప్రస్థానం తదితర పుస్తకాలను చదవి కవిగా మారారు. విద్యార్థి దశ నుంచి జర్నలిస్టు వృత్తిలోకి అడుగుపెట్టి, కవితలకు మరింత పదునుపెట్టారు. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్‌గా పని చేసి 2020లో ఉద్యోగ విరమణ చేశారు. దేవేందర్ కవితా ప్రస్థానం నేటికి కొనసాగుతూనే ఉంది. 1977లో పదోతరగతిలో చంద్రికలో మొదలైన ఈ కవి ప్రస్థానం నేటికి ఆ పరంపర కొనసాగుతూనే ఉంది.
దేవేందర్ కలం నుంచి..
కవుల సమ్మేళనంతో పాటు సాహితీ సమావేశాల్లో పాల్గొంటూ.. వివిధ దినపత్రికలకు కవితలు పంపిన దేవేందర్, 2001లో తొవ్వ పేరుతో మొదటి పుస్తకాన్ని సమాజానికి పరిచయం చేశారు. అలా మొదలైన ఆయన కవిత్వ ప్రయాణం వరుసుగా నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, బుడ్డ పర్కలు, బొడ్డు మల్లెచెట్టు, పొద్దుపొడుపు, పొక్కిలి, వాకిళ్ల పులకరింత, బువ్వకుండ, దీర్ఘకవిత, ఇంటి దీపం, 2018లో వరిగొలుసులు, 2021లో గవాయి సంపుటాలు వెలువరించారు. కన్నీళ్లు, ఎన్కౌంటర్లు, ఆకలి చావులతో వెలువడిన ‘నా తెలంగాణ పల్లె ఎట్లుంది’ అనే కవితా సంకలనం తెలంగాణ ఉద్యమంలో తోడుగా నిలవడంతోపాటు దేవేందర్‌కు మంచి గుర్తింపును తెచ్చింది. 2022లో రెండు ఆంగ్ల అనువాద పుస్తకాలతో పాటు మరోకోణం సామాజిక వ్యాసాలు వెలువడ్డాయి. అలాగే ‘ఊరి దస్తూరి’ పేరుతో తీసుకొచ్చిన పుస్తకం మన కండ్లముందు అన్ని జరుగుతున్నట్టే కనిపిస్తుంది.
అనేక పురస్కారాలు..
తెలంగాణ భాషతోనే అనేక పుస్తకాలను వెలువరించి ప్రముఖకవి రచయితగా గుర్తింపు పొందిన అన్నవరం దేవేందర్‌కు అనే సాహితీ సంస్థల నుంచి పురస్కారాలు, అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు 15 పుస్తకాలు ఈ కలం నుంచి వెలువడగా, ఇందులో 13 కవిత్వం, 2 వ్యాసాల పుస్తకాలున్నాయి. అన్నవరం కవిత్వంలో వెలువడిన పొక్కిలి వాకిళ్ల పులకరింతకు పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం లభించింది. ఊరి దస్తూరి పుస్తకానికి తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పరస్కారం లభించింది. ఇలా ఆయన పలు పుస్తకాలకు రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం, మలయశ్రీ సాహిత్య పురస్కారం, మా రసం రుద్రరవి పురస్కారం, ఉమ్మడిశెట్టి ప్రతిభా పురస్కారంతో పాటు అనే సంస్థల నుంచి పురస్కారాలు, అవార్డులను అందుకున్నాడు.
నేటి కవులు అధ్యయనం చేయడం లేదు..
కవి అంటే సమాజం.. సమాజం గురించి అవగాహన కల్గినవాడే కవి. నేటి సమాజంలో అన్ని విషయాలను అధ్యయనం చేయకుండా కవులుగానే అనేక మంది మనకు కనిపిస్తున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర అంశాలపై అవగాహన కల్గినవాడే కవిగా రాణిస్తాడు.
– అన్నవరం దేవేందర్ కవి,రచయిత
కవి పరిచయం..
పేరు : అన్నవరం దేవేందర్
ఊరు: పోతారం(ఎస్)
మండలం: హుస్నాబాద్
పుట్టిన తేదీ : 17-10-1962
విద్యాభ్యాసం: ఎంఏ
సామాజికశాస్త్రం