మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదారమ్మ తరలిరానున్నది. బీడుపడ్డ భూమికి పచ్చలహారం తొడగనున్నది. వారం రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. కాళేశ్వరం లింక్ ప్రాజెక్టులో చివరిదైన గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను అతి త్వరగా ప్రారంభించేలా మంత్రి హరీశ్‌రావు కృషిచేస్తూ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల క్రితం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈనెలలోనే ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ దిశగా ప్రాజెక్ట్, ఇరిగేషన్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కన్నపేట, జూన్ 10: మెట్ట ప్రాంతం ఇక గోదారి జలాలతో సస్యశ్యామలం కానున్నది. బీడు భూముల్లో గోదారి జలాలు గలగల పారనుండగా, పుడమికి పచ్చలహారం తొడగనున్నది. దీంతో దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. వారంలోగా గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్న్‌న్రు ప్రారంభించేందుకు ప్రాజెక్ట్, ఇరిగేషన్ అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఇప్పటికే ట్రయల్ రన్, ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌రావు పరిశీలించి, సంబంధింత అధికారులకు ట్రయల్ రన్ విజయవంతం చేసేలా దిశానిర్దేశం చేశారు. కాగా, కాళేశ్వరం లింక్ ప్రాజెక్ట్‌లో చివరిదైన గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను అతి త్వరగా ప్రారంభించేలా మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తూ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇందులో భాగంగా రెండు, మూడు రోజుల క్రితం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించి, ఈనెల 12న రిజర్వాయర్ ట్రయల్ రన్ ప్రారంభించాలని ఆదేశించారు. ఆ దిశగా ప్రాజెక్ట్, ఇరిగేషన్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ట్రయల్ రన్‌ను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ట్రయల్ రన్ ప్రారంభంపై ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, భూనిర్వాసితులు, నియోజకవర్గ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
‘1984 అక్టోబర్ 14న వరంగల్ జిల్లా జనగామ బహిరంగ సభకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హాజరయ్యారు. తరుచూ కరువు కాటకాలకు గురవుతున్న మెట్ట ప్రాంతాలకు శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆమె, బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గోదావరి మిగులు జలాలు వినియోగించుకునే అవకాశం ఉందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి హుస్నాబాద్ (అప్పటి ఇందుర్తి నియోజకవర్గం)మీదుగా వరద కాలువ నిర్మించి రైతులకు సాగు నీరందించాలని అధికారులకు సూచించారు.
1985లో రాష్ట్ర ప్రభుత్వం వరద కాలువ నిర్మాణం కోసం సర్వే చేసేందుకు జీవో జారీచేసింది. 1993లో రూ.859కోట్ల వ్యయంతో వరదకాలువ నిర్మాణం పనులకు అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతుండటంతో పనులు నత్తనడకన సాగాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచింది. 30ఏండ్లల్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయని పనులను టీఆర్ఎస్ ఆరేండ్లలో పూర్తి చేసింది.

ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌లో భాగంగా గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు అవసరమనే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గౌరవెల్లి రిజర్వాయర్‌కు 1800 ఎకరాల భూమిని సేకరించగా, మరో 2వేల ఎకరాల భూమి అదనంగా అవసరం పడుతుందని, ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం 1.141 టీఎంసీ నుంచి 8.3 టీఎంసీకి పెరుగుతుందని వెల్లడించారు. గూడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లితో పాటు అదనంగా సోమాజితండా, చింతలతండా, జాలుబాయితండా ముంపునకు గురికానున్నట్లు ఇరిగేషన్, ప్రాజెక్ట్ అధికారులు నిర్ధారించారు.
గతంలో ఎకరాకు రూ. 2.10 లక్షల పరిహారం చెల్లించి భూములను సేకరించగా, తెలంగాణ సర్కారు నిర్వాసితుల కోరుకున్న విధంగా ఎకరాకు రూ. 6.95 లక్షలు, అంతేకాదు చివరిలో 170 ఎకరాలకు రూ.15లక్షల చొప్పున పరిహారం కూడా అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.8లక్షల చొప్పున పరిహారం చెల్లించింది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 90 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్ట్‌తో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని 17 గ్రామాలకు, కోహెడలో 8, చిగురుమామిడిలో 10, భీమదేవరపల్లిలో12, సైదాపూర్‌లో 3, ధర్మసాగర్ మండలంలో 13, ఘన్‌పూర్‌లో 16 గ్రామాలు, జాఫర్‌గఢ్, హన్మకొండ మండలాల్లో ఒక్కో గ్రామం, రఘునాథ్‌పల్లి మండలంలో 4 గ్రామాలకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్ కట్ట పొడువు 10.6 కిలోమీటర్లు, 6 మీటర్ల వెడల్పు, 42 మీటర్ల ఎత్తుతో నిర్మించారు.

మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చే ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కింది. ట్రయల్ రన్ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్, ప్రాజెక్ట్ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రిజర్వాయర్ కట్టాలనేది ఈ ప్రాంత రైతుల ఆకాంక్ష. రిజర్వాయర్ కోసం దశాబ్దాల కాలంగా ఇక్కడి రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ కల నెరవేరనున్నది.
గోదారి జలాలను స్వయంగా ముద్దాడనున్నారు. ఎన్నో ఏండ్ల పోరాట ఫలితంగా రిజర్వాయర్ ప్రారంభించుకోవడం చారిత్రాత్మక ఘట్టం. చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలోని ప్రజలందరూ ట్రయల్ రన్‌కు రావాలని కోరుతున్నా.
– వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
మిడ్‌మానేరు నుంచి తోటపల్లి వరకు కాలువ ఉండగా, ఇక్కడ లింక్ కెనాల్ ఉంటుంది. ఇక్కడి నుంచి 16 కిలోమీటర్లు గౌరవెల్లి రిజర్వాయర్ ఉండగా, కోహెడ మండలం గొట్లమిట్ట నుంచి తీగలకుంటపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల ఓపెన్ కాలువ ఉంది. తీగలకుంటపల్లి నుంచి గౌరవెల్లి రిజర్వాయర్ శివారు రేగొండ వరకు 12 కిలోమీటర్ల వరకు చేపట్టిన సొరంగం పనులు పూర్తయ్యాయి.
సొరంగం ద్వారా వచ్చే నీటిని రేగొండ శివారులో నిర్మించిన సర్జిపూల్లో నింపుతారు. 50మీటర్ల పొడువు, 25 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల లోతుతో దీనిని నిర్మించారు. సర్జిపూల్ నుంచి పంప్‌హౌస్‌లోకి నీటిని తోడుతారు. ఈ పంప్‌హౌస్‌ను 130మీటర్ల లోతు 17మీటర్ల వెడల్పు, 65 పొడువుతో నిర్మించారు. పంప్‌హౌస్ నుంచి రిజర్వాయర్‌లోకి 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3 మోటర్లతో నీటిని పంపింగ్ చేయనున్నారు. 120 రోజులు నిరంతరం నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. దీనికి విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ చేపట్టారు.
