ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించే దిశగా సర్కార్ కృషి చేస్తున్నది. ముఖ్యంగా ప్రసూతి సేవలను విస్త్రృతం చేస్తూ తల్లీబిడ్డల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం, కేసీఆర్ కిట్, 12వేల నగదు ప్రోత్సాహం, 102 వాహనంలో దవాఖానకు తీసుకురావడం, ఇంటి వద్ద దించడంలాంటి కార్యక్రమాలతో గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం భరోసా ఇస్తున్నది.
ఈ క్రమంలో గ్రామీణ పేదలకు మెరుగైన వైద్య సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు మెదక్ జిల్లా కేంద్రంలో ఐదెరకాల విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని రూ.17 కోట్లతో నిర్మించింది. దవాఖానలో అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తవగా, నేడు వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. దవాఖాన ఏర్పాటుతో ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్టపడడంతో పాటు జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు చేకూరుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్, మే 26(నమస్తే తెలంగాణ) :తల్లీ, బిడ్డా క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి సేవలు అందించడంతో పాటు మాతా శిశువులకు, 102 వాహనాల్లో పైసా ఖర్చు లేకుండా ఇంటికి చేరుస్తున్నది. తల్లీబిడ్డలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ సమీపంలో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌సీ) భవనం పూర్తయ్యింది.
నిర్మాణానికి రూ.17 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఎంసీహెచ్‌సీ చుట్టూ ప్రహరీకి రూ.80 లక్షలు మంజూరు చేయగా, భవనం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎంసీహెచ్‌సీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.20కోట్లు మంజూరు చేయగా, ఆ పనులు కూడా పూర్తయ్యాయి. శుక్రవారం (నేడు) రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవనం ప్రారంభోత్సవం కానున్నది.
మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ సమీపంలో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)కు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక కృషితో రూ.17 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంసీహెచ్ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.80 లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎంసీహెచ్ వరకు సీసీ రోడ్డుకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి. దీంతో పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులతో పాటు కాంట్రాక్టర్లకు సూచించారు.
జిల్లా కేంద్రంలోని పిల్లికోటాల్ సమీపంలో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) భవనాన్ని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంతో గర్భిణులకు, జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందనున్నది. ఎంసీహెచ్‌కు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు అందుకు సహకరించిన మంత్రి హరీశ్‌రావులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
-పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మెదక్
మాతా శిశు సంరక్షణ కేంద్రానికి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించినట్లు మెదక్ జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖాన నుంచి 40 శాతం డాక్టర్లు, నర్సులు, స్టాఫ్‌నర్సులను మాతా శిశు సంరక్షణ కేంద్రానికి కేటాయించారు. ఇందులో 12 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. ఇందులో ముగ్గురు చిన్న పిల్లల వైద్యులు కాగా, ముగ్గురు అనస్తేసియా, ఆరు మంది ‘గైనిక్’ డాక్టర్లు ఉన్నారు. 5 మంది డీఎంవో (ఎంబీబీఎస్ డాక్టర్లు), ముగ్గురు హెడ్ నర్సులు, 26 మంది స్టాఫ్ నర్సులు, 15 మంది పారా మెడికల్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.