ప్రస్తుతం విద్య, వైద్య, వ్యాపారం, క్రీడలతో పాటు ప్రభుత్వ,ప్రైవేట్, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనూ మగవారితో సమానంగా మహిళలు ప్రతిభ చాటుతున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పుట్టిన దగ్గర నుంచి వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడవాళ్లు వంటింటికే పరిమితం.. మగవారే అధికులు అనే సంకుచిత భావాలు ఉన్నవారికి గట్టి సమాధానం చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని హరిదాస్పూర్, శివన్నగూడెం గ్రామస్తులు. ఇక్కడ ఆడపిల్లలు పుడితే ఊరంతా పండుగ చేసుకుంటున్నారు. బిడ్డతో పాటు తల్లిదండ్రులను సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్స్ తెరిచి తొలి ఐదు నెలల మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొండాపూర్, మే 26 : ఆడపిల్ల.. ఈ పదం అంటేనే గిట్టని వాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందా.. అంటు అవహేళన చేస్తుంటారు. అలాంటి వారికే కాదు ప్రపంచానికే గుణపాఠం నేర్పించింది ఓ గ్రామం. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే బాధపడేవాళ్లుంటారు. మగ పిల్లాడు పుడితే బాగుం డు! అని నిట్టూర్చే వాళ్లు ఈ లోకంలో లేకపోలేరు. కానీ తాము మాత్రం ఇందు కు భిన్నంగా ఉంటామని సమాజానికి చాటి చెబుతున్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే బాధపడే ఈ రోజుల్లో ఆడపిల్లలు పుట్టారంటే సంబురాలు చేసుకుంటున్నారు.
ఏడాదిలో 11మంది అమ్మాయిలే పుట్టడం ఆ గ్రామాన్ని ఆనందంలో ముంచేసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని హరిదాస్పూర్, శివన్నగూడెం గ్రామ వాసులు ఇకపై ఆడబిడ్డలు పుట్టగానే సంబురాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఈ పల్లెల్లో మొత్తం 816మంది నివసిస్తుండగా లింగ నిష్పత్తిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే కొనసాగితే మహిళల మనుగడకే ముప్పు వస్తుందని గ్రహించిన గ్రామ పెద్దలు ఆడపిల్లలు పుడితే కన్నవారిని సన్మానించాలని నిర్ణయించారు. ఏడాదిలో 11మంది ఆడపిల్లలు జన్మిస్తే సర్పంచ్ ఎండీ షఫీతో పాటు పంచాయతీ పాలకవర్గం, మహిళలు, గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద సంబురాలు చేసుకుంటారు. ఆడపిల్లల తల్లిదండ్రులను పంచాయతీ కార్యాలయం వద్దకు పిలిపించి ఘనంగా సన్మానిస్తారు.
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వారి పేర్లు నమోదు చేయించడంతో పాటు ఒక్కో శిశువుకు రూ.1000 చొప్పున తొలి ఐదు నెలల మొత్తాన్ని వారి ఖాతాలో జమచేసేందుకు పంచాయతీ పాలకవర్గం ముందుకొచ్చింది. కలెక్టర్ హనుమంతరావు, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు ఈ గ్రామాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుపడానికి కృషి చేస్తున్నారు.
ఆడపిల్ల పుట్టిందని తెలియగానే గ్రామస్తులందరూ ఎంతో ఆప్యాయతగా పలకరించారు. కన్నది కూతురిని అనే సంగతినే నన్ను మరిపించేశారు. గ్రామంలో ఏడాదిలో ఇప్పటి వరకు 11మంది అమ్మాయిలే పుట్టారు. మాకు ఆడపిల్లలు జన్మించడంతో స్థానిక సర్పంచ్‌తో పాటు పంచాయతీ పాలకవర్గం మమ్మల్ని ఘనంగా సన్మానించారు.
– ప్యాట లత, హరిదాస్పూర్
గ్రామంలో జరుగుతున్న పనులను చూసి ప్రభుత్వం ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. పది సంవత్సరాలోపు ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికీ అకౌంట్స్ ఓపెన్ చేయించి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వారి పేర్లు నమోదు చేయించడంతో పాటు వారికి ఒకొక్కరికి రూ. 1000 చొప్పున ఖాతాలో నగదు మొత్తాన్ని జమచేశాం. గ్రామంలో ఆడపిల్ల పుడితే, కన్నవారిని కూడా ప్రోత్సహించాలని నిర్ణయించాం. అందుకు కట్టుబడి ఉన్నాం. ఆడపిల్లల తల్లిదండ్రులను పంచాయతీ కార్యాలయం వద్దకు పిలిపించి ఘనంగా సన్మానిస్తాం. ప్రతి ఊరూ ఈ పద్ధతిని పాటించాలి.
– ఎండీ షఫీ, సర్పంచ్ హరిదాస్పూర్