మృగశిర సందర్భంగా బుధవారం చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. చేపల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు కనిపించాయి. పల్లెలు, పట్టణాల్లో జలపుష్పాల కోసం జనం క్యూ కట్టారు. పెద్ద ఎత్తున చేపల విక్రయాలు జరగడంతో సంగారెడ్డి పట్టణంలోని చేపల మార్కెట్ ఇలా కిటకిటలాడింది.
– మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, జూన్ 8
తెలంగాణలో ప్రకృతికి అనుగుణంగా వచ్చే మార్పులను ప్రజలందరూ స్వాగతిస్తుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణలో విశేషంగా భావించే మిర్గం (మృగశిరకార్తె) బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మృగశిర కార్తె ప్రవేశిస్తున్న సమయంలో చేపలను తింటే ఉబ్బసం వ్యాధితోపాటు పలురోగాలు నయమవుతాయనే నమ్మకం అనాదిగా వస్తుండడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. రౌట, బొచ్చ, బంగారు తీగ తదితర చేపలు రూ.250 వరకు ధర పలికాయి. కొర్రమీను చేపలు కిలోకు సుమారు రూ.500 వరకు అమ్ముడుపోయాయి.