చిన్నకోడూరు, జూన్ 3 : ప్రతిపక్ష పార్టీల నాయకులు పల్లె ప్రగతిని అపహాస్యం చేస్తూ.. పనులకు నిధులు చెల్లింపులు జరుగలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీ చాం బర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నరేగా పథకం కింద రూ.1400 కోట్లు బండి సంజయ్ విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. పనులు సక్రమంగా జరుగుతుంటే రాజకీయ పబ్బం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారన్నా రు. పల్లె ప్రగతిలో ప్రజలు కదంతొక్కి పాల్గొంటున్నారని తెలిపారు. బండి సంజయ్ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. జిల్లాలోని 499 పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైందన్నారు. నాలుగు విడతల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల ఆదేశాల మేరకు శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు.
ఐదో విడత పల్లె ప్రగతిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల డబ్బులు ప్రతినెలా ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జూన్ నెలలో రూ.256 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జిల్లాలో 640 చెక్కులు ఉంటే సుమారు రూ.33 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. కేంద్రం నుంచి నరేగా ద్వారా విడుదల కావాల్సిన రూ.1400 కోట్లు విడుదల చేయలేదన్నారు. చేసిన పనులకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నారు.
దేశంలో ఎంపిక చేసిన
దేశంలో ఉత్తమ పంచాయతీల్లో 10 వరకు తెలంగాణ రాష్ర్టానికి చెందినవే ఉన్నాయని, దేశంలో 20 పంచాయతీలను ఎం పిక చేస్తే.. అందులో 19 తెలంగాణవే ఉన్నాయన్నారు. పల్లెప్రగతి విజయవంతం కాకపోతే ఉత్తమ పంచాయతీలకు అవార్డు లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చిన అవార్డులు కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భూంరెడ్డి, మండల సోషల్ మీడియా కన్వీనర్ రాజలింగం పాల్గొన్నారు.