సిద్దిపేట అర్బన్/ సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 3: మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 5వతేదీన ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గురుకుల కళాశాలల్లో ఇంటర్, డిగ్రీకి సంబంధించి మొత్తం 4,388 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 3,846 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, 542 మంది విద్యార్థులు డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్స్, స్టాఫ్ నర్సులను నియమించామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతీయ ఆర్సీవో ప్రభాకర్ స్పష్టం చేశారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సెల్: 7676 727651, మెదక్ జిల్లాకు సంబంధించి సెల్: 7993 456679, సిద్దిపేట జిల్లాకు సంబంధించి సెల్: 79950 76687 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ ను www://mjptbewreis. telangana. gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న పరీక్షకు సంబంధించి జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి 1,634 మంది విద్యార్థులు, డిగ్రీలో ప్రవేశానికి 231 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి 1,207 మంది, డిగ్రీలో ప్రవేశానికి 184 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి 1,005 మంది విద్యార్థులు, డిగ్రీలో ప్రవేశానికి 127 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
