ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు చేపట్టిన బడిబాట కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం ప్రారంభమైంది. ఉపాధ్యాయులు, ఎంఈవోలు, అధికారులు గ్రామగ్రామాన ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులను కలిసి సర్కారు బడుల గురించి వివరించారు. ర్యాలీలు చేపట్టి, కరపత్రాలు పంపిణీ చేశారు. కార్పొరేట్ దీటుగా మౌలిక వసతుల కల్పన, ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం, సుశిక్షుతులైన ఉపాధ్యాయులచే బోధన, మధ్యాహ్న భోజన సదుపాయం తదితర అంశాలను వివరించారు. హవేళీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో బడిబాటలో భాగంగా ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.
హవేళీఘనపూర్, జూన్ 3 : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమాన విద్యనందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఔరంగాబాద్ తండాలో మనఊరు- మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఔరంగాబాద్ తండాలో పాఠశాలకు గతంలో ఫెన్సింగ్ వేశామని, ప్రహరీ నిర్మాణానికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ఔరంగాబాద్తండా మెయిన్ రోడ్డుకు పాఠశాల ఉందని, వాహనాల శబ్ధాలతో విద్యార్థులు ఇబ్బందులు పడు తున్నారని, ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనం వెనుక రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. మనఊరు- మనబడి కార్యక్రమంతో గ్రామీణ పిల్లలందరికీ నాణ్యత విద్యనందించడానికి ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుజాత, సర్పంచ్ లాడికి, ఉప సర్పంచ్ లక్యా, ఎంపీటీసీ మంగ్యా, డీఈవో రమేశ్, ఎంపీడీవో శ్రీరామ్, ఎంఈవో నీలకంఠం, సర్పంచ్‌లు లింగం, శ్రీహరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు తదితరులు ఉన్నారు.
హవేళీఘనపూర్ శ్రీసాయి శ్రీనివాస గార్డెన్స్‌లో ముత్తాయిపల్లి మాజీ సర్పంచ్ గోపాల్‌గౌడ్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
శివ్వంపేట, జూన్ 3 : విద్యతోనే విద్యార్థులు ఉన్నతశిఖరాలకు చేరుకోగలరని అందుకే పిల్లలందరీ ప్రభుత్వ పాఠశాల్లో చదివించాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. మండల విద్యాధికారి బుచ్యానాయక్తో కలిసి ఉసిరికపల్లి గ్రామంలో బడిబాట ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించడానికి మనూరు- మనబడి కార్యక్ర మాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
సర్పంచ్ పోతరాజు బాబూరావు స్వంత డబ్బులతో గ్యాస్ సిలిండర్ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బాబురావు, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డి, కృష్ణారావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి తాటికొండ రాజశేఖర్ గౌడ్, నాయకులు శిలువేరి వీరేశం, లక్ష్మీనారాయణ, గోపాల్ రెడ్డి, సోమన్నగారి శేఖర్‌గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ/నిజాంపేట, జూన్ 3 : మెదక్ జిల్లా కేంద్రంలో జంబికుంట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సదుపాయలు, వసతులను వివరించి పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు. బడీడు పిల్లల వివరాలు నమోదు చేసుకున్నారు. క్రార్యక్రమంలో హెచ్ఎం వెంకట్రాంరెడ్డి, టీచర్లు అంజమ్మ, భూపతిగౌడ్, నర్సింగరావు, ప్రశాంత ఉన్నారు.
నిజాంపేట మండలం చల్మెడలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఉపాధ్యాయులతో కలిసి ఇం టింటికీ వెళ్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత, సదుపాయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లల వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయరామగౌడ్, ఉపాధ్యాయులు శ్రీకాంత్, వేణుగోపాల్, స్థానిక అధికారులు ఉన్నారు.
చేగుంట/కొల్చారం/వెల్దుర్తి, జూన్ 3 : బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కర్నాల్‌పల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, పోలంపల్లి పాఠశాల హెచ్ఎం సిద్ధిరాములు పేర్కొన్నారు. చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి, పోలంపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తల్ల్లీదండ్రులకు వివరించారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు సంపత్, కవిత పాల్గొన్నారు.
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కొల్చారం ఉర్దూ మీడియం పా ఠశాల ప్రధానోపాధ్యాయుడు నసీరుద్దీన్ అన్నారు. కొల్చారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారు. బడీడు పిల్లల వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో టీచర్లు జాఫీరా, ఉలియా ఉన్నారు.
అర్హత కలిగిన ఉపాధ్యాయులు, అన్ని రకాల మౌలిక వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన జరుగుతుందని వెల్దుర్తి ఎంఈవో యాదగిరి అన్నారు. వెల్దుర్తిలో ర్యాలీ నిర్వహించారు. పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా బడిబాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సాంబయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.