తూప్రాన్/మనోహరాబాద్, జూన్3: మెదక్ జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి చేరువలో ధాన్యం సేకరణ పూర్తి చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి, తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
కేంద్రాల వద్ద ఉన్న రైతులు, అధికారులు, హమాలీలతో మాట్లాడారు. వర్షాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో వరి కోతలు ఆలస్యంగా మొదలవ్వడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఆలస్యంగా వస్తున్నదని మెట్టు బాలకృష్ణారెడ్డి తెలిపారు. కూలీల కొరత లేకుండా బిహార్ రాష్ట్రం నుంచి హమాలీలను రప్పించి, వసతి కల్పించి, ధాన్యాన్ని లోడ్ చేయిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు, మెదక్ జిల్లా అధికారుల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 2,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందన్నారు. వారం లోపు పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లుకు తరలించాలన్నారు. కొనుగోలు వివరాలను పూర్తి చేసి రైతులకు పూర్తిగా చెల్లింపులు చేయాలన్నారు. అనంతరం జిల్లాలో సీఎంఆర్ బియ్యం డెలివరీ పురోగతిపై ఆర్డీవో కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 2020-21 బియ్యం డెలివరీలో మిగిలిన 16 వేల మెట్రిక్ టన్నులను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుని, పనులు వేగవంతం చేయాలని సూచించారు.
తూప్రాన్, మనోహరాబాద్‌లో కొత్తగా రైల్వే లైన్ వచ్చిన దృష్ట్యా బియ్యం లోడింగ్ పాయింట్, సేకరణకు అనుగుణంగా ఎఫ్‌సీఐ అధికారులకు సూచనలు అందజేయాలని, కలెక్టర్ హరీశ్ సూచన మేరకు కమిషనర్‌కు ప్రతిపాదనలు అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే లోడింగ్ పాయింట్లు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లయిస్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, మేనేజర్ సాయిరామ్, ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, తహసీల్దార్ భిక్షపతి పాల్గొన్నారు.