సంగారెడ్డి కలెక్టరేట్, పటాన్చెరు, మే 26 : సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టిన సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు, మహాప్రస్థానాల నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, మహాప్రస్థానాలు నిర్మిస్తున్నదన్నారు. నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, అందుకు సంబంధిత కాంట్రాక్టర్లు డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీల్లోని ప్రతివార్డులో పట్టణ ప్రకృతివనం, క్రీడా ప్రాంగణం, నర్సరీ తప్పకుం డా ఉండాలని, మున్సిపల్ కమిషనర్లు ఆదిశగా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, అధికా రులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
పటాన్చెరు మండలంలో కలెక్టర్ హనుమంతరావు విస్తృతంగా పర్యటించారు. గురువారం మండలంలోని కర్ధనూర్‌లో జీసస్ మేరీ పాఠశాలలో‘పది’ పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారో ప్రత్యక్షంగా గమనించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. సర్పంచ్ ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి , ఉప సర్పంచ్ వడ్డే కుమార్ వారు అభివృద్ధి చేసిన గ్రామీణ క్రీడాస్థలాన్ని చూపించారు.
ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మూడు కోర్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అక్కడ పెంచిన చిట్టడివిని పరిశీలించి వారిని అభినందించారు. గ్రామీణ క్రీడాస్థలాలతో యువతకు ఆటపాటలకు అవకాశం ఉంటుందన్నారు. నందిగామలోని మన ‘ఊరు- మన బడి’ కార్యక్రమానికి ఎంపికైన నందిగామ పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో అందజేస్తున్న పోషకాహారాన్ని పరిశీలించి, ఆ పాఠశాలలో జరుగుతున్న పనులు, మౌలిక వసతులపై ఎంఈవో పీపీ రాథోడ్‌ను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇస్నాపూర్‌లో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. పరిశ్రమలున్న ఈ ప్రాంతంలో మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీవో బన్సీలాల్‌కు సూచించారు. వచ్చే వర్షాకాలంలో హరితహారం లో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని కార్యదర్శులను ఆదేశించారు. ముత్తంగిలో డంపింగ్‌యార్డును పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఆర్ఐ రాజు, కార్యదర్శులు సిద్ధమ్మ, లక్ష్మీ నీలిమా, పద్మావతి, నవోద్రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఉన్నారు.