సిద్దిపేట అర్బన్, జూన్ 1 : గీత కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ముందుచూపు ఉన్న వ్యక్తి సీఎంగా కేసీఆర్ ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని 529 మంది గీత కార్మికులకు గుర్తింపు కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద రూ.5 కోట్ల వ్యయంతో గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని, రెండు నెలల్లో అది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక గౌడ కులస్తులకు వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు, సొసైటీ పునరుద్ధరణ, కొత్త లైసెన్స్‌లు అందజేస్తున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో గీత కార్మికులకు లైసెన్స్‌లు దొరికేవి కావని.. పైగా సొసైటీలు రద్దు చేసేవారని చెప్పారు. గీత కార్మికుల లైసెన్స్ పదేండ్లకు ఒకసారి రెన్యువల్ చేస్తామని, తెలంగాణ ఏర్పాటయ్యాక 8 ఏండ్లలో గీత కార్మికులపై ఒక్క కేసు, వేధింపులు లేకుండా ఆదుకున్నామని మంత్రి వివరించారు.
గీత కార్మికుడు మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నామని, 15 శాతం వైన్ షాపుల్లో గీత కార్మికులకు రిజర్వేషన్లు తెచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. బడ్జెట్లో గౌడ కులస్తులకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. మత్స్యకారులకు ఉన్న తరహాలో గీత కార్మికులకు ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ తేనున్నారని తెలిపారు. 50 ఏళ్లు నిండిన గీత కార్మికుడికి ఫించన్లు, రూ.5 లక్షల బీమా సౌకర్యం, టీఎఫ్టీలో కొత్త కార్డులను టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు.
గతంలో కాంగ్రెస్ అంటే మామూళ్లు ఉండేవని.. తెలంగాణ వచ్చాక 150 టీఎఫ్టీ లైసెన్స్‌లు ఇవ్వడంతోపాటు కేసులు రద్దు చేశామన్నారు. సివిల్స్‌లో 566వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన అఖిల్‌యాదవ్ మన జిల్లాకే గర్వకారణమని.. నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారని మంత్రి అభినందించారు.
కొమురవెల్లి, జూన్ 1 : మండలంలోని మర్రిముచ్చాల సాంద్రానంద ఆశ్రమంలో బుధవారం గౌరీభట్ల దత్తాత్రేయ శర్మ- రవళి దంపతుల కుమారుడు అభినవ నృసిం హ వీరాజశర్మ ఉపనయన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరై అభినవ నృసింహను ఆశీర్వదించారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ రోజారాధకృష్ణశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ పద్మాకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కిషన్, మహేశ్, నర్సింగరావు తదితరులు ఉన్నారు.
చేర్యాల, జూన్ 1 : మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన యాదవ కులస్తులు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును బుధవారం జిల్లా కేంద్రం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాద వ సంఘం నాయకులు మంత్రికి పలు సమస్యలు తెలియజేయడంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో యాదవ కులస్తులు వెంకటేశ్, కొమురయ్య, యాదయ్య, శేఖర్, శ్రీనివాస్, బాబు, సంపత్ ఉన్నారు.