నంగునూరు, మే 30 : ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ అన్నారు. సోమవారం మండలంలోని నర్మెటలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారన్నారు.
ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు గ్రామాల వారీగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి చూపు లేని వారికి చూపు కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో ఆపరేషన్ల కోసం అవసరమైన వారిని గుర్తించి సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానల్లో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో గుర్తించిన రోగులకు ప్రభుత్వమే ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేస్తుం దన్నారు.
నర్మెటలో 164 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 50 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ అజీద్, ఉప సర్పంచ్ కుమార్, డాక్టర్ గౌతమి ప్రియ, ఆప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీనివాస్, ఉచిత కంటి శిబిరం నోడల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్, పీహెచ్ఎన్ హేమలత, హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.