కోచింగ్ సెంటర్ల మాటే లేదు.. పేదరికం అడ్డు కాలేదు.. అపజయాలను లెక్కచేయలేదు.. మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యాడు.. కార్యసాధనలో ఎదురయ్యే ఓటములకు తలొగ్గకుండా ముందుకు సాగాడు.. ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 566 ర్యాంకు సాధించి, విజయకేతనం ఎగురవేశాడు కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ధి అఖిల్ యాదవ్. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపించాడు. ప్రతిరోజూ చదవడం.. చదివిన ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పరీక్షల్లో విజయం సాధించానని అఖిల్పేర్కొన్నాడు.
కొండపాక, మే 30 : “సాధించాలనే సంకల్పం ఉంటే చాలు ఎంతటి అవాంతరాలు వచ్చినా అధిగమించవచ్చు… కార్యసాధనలో ఎదురయ్యే ఓటములకు తలొగ్గకుండా ముందుకు సాగితే విజ యం సాధించవచ్చు.”.. అన్న మాటలను అక్షరాలా నిజం చేస్తూ ఆలిండియా సివిల్ సర్వీస్ విభాగంలో 566 ర్యాంకు సాధించి విజయకేతనం ఎగురవేశాడు కొండపాక మండలం కొండపాక గ్రామానికి చెందిన బుద్ధి అఖిల్‌యాదవ్. ఎటువంటి కోచింగులకు వెళ్లకుండా తాను ఉన్న ఇంటి ఆవరణలోని ఓ రేకుల గదిని విద్యాలయంగా భావించి, అరకొర వసతులను సద్వినియోగం చేసుకొని దేశంలోనే అత్యున్నతంగా భావించే ఆలిండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. మొదట అపజయాలు ఎదురైనా తలొగ్గక.. నిరుత్సాహానికి తన మదిలో చోటివ్వక… ముందుకు సాగి ఎట్టకేలకు విజయదుందుభి మోగించాడు.
మండల కేంద్రమైన కొండపాకకు చెందిన బుద్ధి లలిత, నరేశ్‌ల పెద్ద కొడుకు బుద్ధి అఖిల్ యాదవ్. కొండపాక గ్రామంలోని సాయి పబ్లిక్ సూల్లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం సిద్దిపేటలోని రవీంద్ర హైసూల్లో టెన్త్ పూర్తి చేసుకొని 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. సిద్దిపేట పట్టణంలోని మాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం అఖిల్ యాదవ్‌లో ఉన్న ప్రతిభను గుర్తించి ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందించింది. ఇంటర్మీడియెట్ ఎంపీసీ విభాగంలో 972 మారులతో సత్తా చాటిన అఖిల్ వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో 2018 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆల్ ఇండి యా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు.
2019లో ప్రిలిమ్స్‌కి హాజరు కాగా అందులో ఫెయిల్ అయ్యాడు. అయినా నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా పట్టుదలతో ముందుకు సాగి 2020లో మళ్లీ పరీక్షలు రాయగా ఈసారి ప్రిలిమ్స్‌లో విజయం సాధించినప్పటికీ మెయిన్స్‌లో ఫెయిల్ అయ్యాడు. అయినా తన సంకల్పంలో పట్టు సడలనివ్వలేదు. సాధించేవరకు సాధన చేస్తూనే ఉండాలి అన్న మాటలను గుర్తు చేసుకొని 2021లో మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు.
ఈ సారి అతని పట్టుదల ముందు పరీక్షలు తల వంచక తప్పలేదు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో విజయం సాధించిన అఖిల్ మే 24వ తేదీన ఢిల్లీలో జరిగిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఇంటర్వ్యూలో యూపీఎస్సీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ఆలిండియా సివిల్ సర్వీస్ విభాగంలో 566 ర్యాంకు సాధించాడు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదం టూ నిరూపించాడు. అఖిల్ యాదవ్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన విష యం మీడియాలో వైరల్ కావడంతో అతన్ని పలువురు ప్రముఖులు ఫోన్లో ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, అఖిల్ యాదవ్, అతని తల్లిదండ్రులను శాలువాతో ఘనంగా సన్మానించారు. చిన్నప్పుడు తన వద్ద అక్షరాలు దిద్దిన అఖిల్ యాదవ్ సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించాడని తెలుసుకున్న సాయి పబ్లిక్ సూల్ ఉపాధ్యాయుడు దామోదర్‌గౌడ్, అఖిల్‌ను కలిసి భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
చిన్నప్పటి నుంచి కొడుకు బాగా చదువుతూ మంచి మారులు సాధించడాన్ని గుర్తించిన అఖిల్ తండ్రి నరేశ్, తల్లి లలిత చదువులో ప్రోత్సహిస్తూవచ్చారు. ఇంటిపేరుకు తగ్గట్టుగా బుద్ధిగా చదువుకునే బుద్ధి అఖిల్ యాదవ్ తప్పకుండా ప్రయోజకుడవుతాడంటూ అఖిల్‌కు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు పదే పదే చెప్పేవారు. దీంతో ఎలాగైనా కొడుకుకు మంచి విద్యాబుద్ధులు నేరించాలని సంకల్పించారు అతడి తల్లిదండ్రులు. విద్యా రంగంలో కొడుకు సాధిస్తూ వచ్చిన విజయాలను తమ కష్టానికి ఫలితంగా అందిన బహుమానంగా భావిస్తూ వ్యవసాయం చేస్తూ అఖిల్‌కు అన్ని సౌకర్యాలు సమకూర్చారు.
అఖిల్ యాదవ్ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించడంతో పుత్రోత్సహంతో నరేశ్, లలిత ఉప్పొంగిపోయారు. కొడుకు సాధించిన విజయాన్ని అందరూ పొగుడుతుంటే ఆనందభాష్పాలతో వారు తమ సంతోషాన్ని పంచుకున్నారు.. అన్న చదువు కోసం తమ్ముడు బుద్ధి అజయ్ సైతం తోడయ్యాడు. ఇంట్లో అన్ని పనులను తానొకడే చేస్తూ తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా నిలిచాడు.
ప్రతిరోజూ చదవడం ..చదివిన ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా పరీక్షల్లో విజయం సాధిస్తూ వచ్చా. సివిల్స్ రాయాలని బలమైన కోరిక ఉండేది. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కోచింగ్‌కి వెళ్లాలని ఎంతో మంది సూచించారు. అయినా కష్టపడి చదివే వారికి కోచింగ్‌లతో పనేముందని అనుకున్నా. కోచింగ్ సెంటర్లకు వెళ్లి చదువుకోవాలంటే నాన్న ఆర్థిక స్థామత సరిపోదు అని భావించా. అమ్మానాన్నలను ఆర్థిక ఇబ్బందులపాలు చేయడం ఇష్టం లేక ఇంటి ఆవరణలోనే ఉన్న ఓ చిన్న రేకుల గదిని నా చదువు కోసం ఏర్పాటు చేసుకున్నా.
యూపీఎస్సీ సిలబస్, ఇంటర్నెట్, ఇంతకు ముందు యూపీఎస్సీ నిర్వహించిన పరీక్ష పేపర్లు, అందులో విజయం సాధించిన వారి అభిప్రాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని చదవడం ప్రారంభించా. మొదటి రెండు ప్రయత్నాల్లో అపజయం ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో మళ్లీ పరీక్షకు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల ప్రోత్సాహం,తమ్ముడు అందించిన తోడ్పాటు నన్ను పరీక్షల్లో విజయం సాధించేలా చేశాయి. నన్ను ప్రోత్సహిస్తూ బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ముందుకు నడిపారు. ఆలిండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది .
– బుద్ధి అఖిల్ యాదవ్