మెదక్, మే 30 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, మే 30: అనాథలైన చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంచి స్ఫూర్తితో ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని సూచించారు. కొవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకు భరోసా అందించేందుకు ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంగారెడ్డి, మెదక్ జిల్లాల అదనపు కలెక్టర్లు రాజర్షి షా, రమేష్ వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం కొవిడ్ బాధిత చిన్నారులకు అండగా ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి గుర్తించిన 9 మంది, మెదక్ జిల్లా నుంచి నలుగురు అనాథలైన చిన్నారులకు 18 సంవత్సరాలు నిండే సరికి రూ.10 లక్షలు అందేలా పోస్టాఫీసులో జమ చేశామని, వీరికి ఆరోగ్య బీమా వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈరోజు ప్రతి చిన్నారి ఖాతాలో రూ.20 వేలు జమ చేశామని స్పష్టం చేశారు. అనంతరం నేనొక ప్రధానిగా కాకుండా మీ కుటుంబంలో ఒక సభ్యుడుగా ఉన్నానంటూ రాసిన లేఖలను చిన్నారులకు అందజేశారు.
కరోనా మహమ్మారి కాలంలో తల్లిదండ్రులను దూరం చేసుకున్న బాధ వర్ణించేందుకు పదాలు లేవన్నారు. మీ బంగారు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దేశం వేసిన ముందడుగే బాలల కోసం పీఎం కేర్స్ పథకం ప్రారంభించామన్నారు. అనంతరం జిల్లాలోని అనాథ చిన్నారులకు ధ్రువపత్రాలు, ఆరోగ్య కార్డులు, పోస్టాఫీస్ పాసు పుస్తకాలు అందజేశారు.
కార్యక్రమంలో సంగారెడ్డి నుంచి మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి పద్మావతి, డీసీపీవో రత్నం, సీడబ్ల్యూసీ సభ్యులు వెంకటేశం, వెరోనికా, విష్ణుమూర్తి, డీసీపీయూ లింగం, రామకృష్ణ, యాదగిరి, మెదక్ నుంచి జిల్లా సంక్షేమాధికారి జయరాంనాయక్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.