పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచి, సామాన్యులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపుతున్నదని, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ధ్వజమెత్తారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పది వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయని మండిపడ్డారు. బంగారు బాతులాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే అభివృద్ధా..? అని ప్రశ్నించారు. ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్న పరిస్థితి మరింత దుర్భరంగా మారిందన్నారు. మెదక్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి టీఎం. ఖాలేద్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు పెంచుతూ.. ప్రజలకిచ్చే రాయితీల్లో కోతలు విధిస్తున్నదని విమర్శించారు.
సంగారెడ్డి అర్బన్/మెదక్ మున్సిపాలిటీ, మే 30: బంగారు బాతుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడమే బీజేపీ అభివృద్ధా అని సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సంగారెడ్డి, మెదక్ కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నా చేశారు. అనంతరం సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి, మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్‌కు వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ధరలు తగ్గించేంత వరకు ప్రజా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. నిత్యావసరాలు, పెట్రో ధరలు ఇష్టానుసారంగా పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో మతోన్మాదం సృష్టించేలా మోదీ పర్యటనలు ఉంటున్నాయన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో రైతన్న పరిస్థితి మరింత దుర్భరంగా మారిందన్నారు. పెంచిన ధరలన్నీ వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ మెదక్ జిల్లా కార్యదర్శి టీఎం.ఖాలేద్ మాట్లాడుతూ పెట్రో, గ్యాస్‌తో పాటు నిత్యావసర సరుకుల ధరలన్నీ రెండు రేట్లు పెరిగాయని మండిపడ్డారు.
అసంఘటిత రంగ కార్మికులు కరోనాతో ఉపాధి కొల్పోయరన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఉన్నవి ఉడిపోతున్నాయని అన్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు పెంచుతూ ప్రజల రాయితీల్లో కోతలు విధిస్తున్నార్నని ఆరోపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి, 14 రకాల నిత్యావసర సరుకులను అందజేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి నిధులు పెంచుతూ పట్టణ ప్రాంతాల్లోనూ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దిన్బాబా, సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్, వామపక్షాల నాయకులు సాయిలు, యాదగిరి, శ్రీనివాస్, యాదవరెడ్డి, అశోక్, రాజయ్య, రమేశ్‌గౌడ్, మహబూబ్‌ఖాన్, తాజోద్దిన్, ప్రసాద్, చంద్రమోహన్, కృష్ణ పాల్గొన్నారు.