మెదక్ మున్సిపాలిటీ, మే 30: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి జూన్ 18వ తేదీ వరకు నిర్దేశిత తేదీల్లో ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ జూన్ 21 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు.
మెదక్ జిల్లాలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల సంఖ్యను బట్టి 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లా కేంద్రం మెదక్‌లో 3, నర్సాపూర్‌లో 2, తూప్రాన్‌లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మొత్తం 1223 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో పదో తరగతి పరీక్షలకు 553 మంది, ఇంటర్మీడియట్‌కు పరీక్షలకు 670 మంది ఉన్నారు. మెదక్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో A, B రెండు కేంద్రాలు, ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.
నర్సాపూర్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో ఒక కేంద్రం, జడ్పీ బాలుర పాఠశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూప్రాన్‌లో జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఒక కేంద్రం, జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు ఏడు సిట్టింగ్ స్కాడ్ బృందాలు, ఒక ప్లయింగ్ స్కాడ్‌ను ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల్లోకి 5 నిమిషాల ఆలస్యానికి మించి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.