సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, మే 30: బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం బడిబాట కార్యక్రమంపై వివిధ జిల్లాల డీఈవోలు, సెక్టోరల్ అధికారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 3 నుంచి 10 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపల్, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖలతో కోఆర్డినేషన్ సమావేశాలను నిర్వహించాలని సూచించారు.
తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. మనఊరు-మనబడి, ఇంగ్లిష్ మీడియంలో బోధన, రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేస్తారనే తదితర విషయాలపై గ్రామగ్రామాన తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభాన్ని పండుగలా చేయాలని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నుంచి డీఈవో రాజేశ్, విద్యాశాఖ అధికారులు, మెదక్ జిల్లా నుంచి డీఈవో రమేశ్‌కుమార్, సీఎంవో సూర్యప్రకాశ్‌రావు, సెక్టోరియల్ అధికారులు జ్యోతి, సుభాష్, శశిధర్, శ్రీకాంత్, మహేశ్, ఎంఈవో యాదగిరి తదితరులు పాల్గొన్నారు.