ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 నుంచి 56 శాతానికి పెరిగాయని, దీన్ని మరింత పెంచేలా కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ సమీపంలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తల్లీబిడ్డలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 100 పడకలతో దవాఖాన ఏర్పాటైందని తెలిపారు.
గైనకాలజిస్టులు, మత్తు వైద్యులు, పిల్లల డాక్టర్లు అందుబాటులో ఉంచుతామని, డెలివరీలకు ప్రైవేటులో రూ.50వేలు తీసుకుంటే, ఇక్కడ ఉచిత ప్రసవంతో పాటు కేసీఆర్‌కిట్ అందజేసి, తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేరుస్తామన్నారు. సాధారణ కాన్పులు పెరిగేలా చూడాల్సిన బాధ్యత ఆశవర్కర్లదే నని, సాధారణ కాన్పు కోసం గర్భిణులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. అనంతరం దళితబంధు పథకం కింద 26 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, టాటాఏస్ వాహనాలను అందజేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్ మాట్లాడుతూ గతంలో మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ దవాఖానకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం మెదక్‌లోనే అత్యాధునిక వసతులతో కార్పొరేట్ తరహాలో దవాఖాన ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని అన్నారు.
మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ అర్బన్: సర్కారు దవాఖానల్లో కాన్పుల శాతం పెరగాలని, ప్రస్తుతం 30 నుంచి 56 శాతం ప్రసవాలు పెరిగాయని, ఆశవర్కర్లు బాధ్యత తీసుకుని, కష్టపడి పనిచేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ సమీపంలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన ‘దళిత బంధు’ లబ్ధిదారులకు సమావేశానికి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎక్కడైనా నిర్మిస్తే కేవలం 50 పడకల దవాఖానగా నిర్మిస్తారని, కానీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో సీఎం ఆశీస్సులతో మెదక్‌లో 100 పడకల దవాఖానగా నిర్మించుకున్నామన్నారు. పాత దవాఖానను యథావిధిగా ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారని తెలిపారు.
మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గైనకాలజిస్టులు, మత్తు వైద్యులు, పిల్లల డాక్టర్లు, ఇతర ప్రత్యేక డాక్టర్లు, సిబ్బందిని, మిడ్ వైఫరీ కోర్సు చదివిన వారిని కూడా నియమిస్తారని తెలిపారు. ఏఎన్ఎంలకు ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి వారి సేవలను కూడా ఉపయోగించుకోటున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సదుపాయాలను కల్పిస్తున్నారని, ప్రైవేట్ దవాఖానలకు డెలవరీలకు వెళ్తే రూ.50 వేలు ఖర్చు అవుతుందని, సర్కారు దవాఖనాల్లో డెలవరీ అయితే రూ.12 వేలతో పాటు కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నామన్నారు. ఆశ వర్కర్లు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని, డెలివరీ కేసులను సర్కారు దవాఖానలకు తీసుకురావాలని సూచించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షకులు ఆశ కార్యకర్తలేనని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో ఆరోగ్యశాఖలో అందరికంటే ముందుండేవారని, మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పుట్టిన బిడ్డకు ముర్రు పాలు మొదటి గంటలో అందాలని, కేవలం 36శాతం చిన్నారులకు మాత్రమే అందుతుందని పేర్కొన్నారు. మొదటి ఏఎన్సీ చెకప్ నుంచి దృష్టి సారించాలని, సాధారణ కాన్పు కోసం కౌన్సిలింగ్ ఇవ్వాలని, రాబోయే రోజుల్లో సాధారణ ప్రసవాలకు వైద్య సిబ్బందికి రూ.3వేల ఇన్సెంటీవ్ ఇస్తామని తెలిపారు.

పేదలను ప్రభుత్వ దవాఖానలకు తీసుకొచ్చి నార్మల్ డెలవరీలు చేసేలా ఆశ వర్కర్లు కృషి చేయాలని సూచించారు. ఈ మధ్య ఖమ్మం, సిద్దిపేట దవాఖానల్లో ఎక్సర్సైజ్ చేయిస్తున్నారని, దానికి సెపరేట్‌గా ఒక రూంను ఏర్పాటు చేశారని, స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఎక్సర్సైజ్లకు సంబంధించి యాప్ ఉందని మీరు చేయాల్సిందల్లా నార్మల్ డెలివరీలు చేయించాలని సూచించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆశల జీతం రూ.1,500 ఉంటే దానిని రూ.9,500లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ప్రతి నెలా మూడో తేదీన ఆశలతో టెలీకాన్ఫరెన్స్ ఉంటుందని, అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. మీ నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని, అమ్మఒడి వాహనం సేవలు అందించాలని, ఎవరూ పనిచేయకున్నా వారిపై చర్యలు తప్పవని, త్వరలో మెదక్‌కు వస్తానని, మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించకుందామని తెలిపారు.
దళిత బంధు అనేది ఒది ఒక పథకం కాదని ఇది ఒక ఉద్యమమని, దళిత సంరక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్‌లో 26 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను అందజేశారు. దేశంలోనే మొదటిసారి వివిధ ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, లైసెన్స్‌ల విధానంలో 16 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చి దళితులకు రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు. వైన్స్‌లు, మెడికల్, ప్రభుత్వ దవాఖానల్లో డైట్, శానిటేషన్ కాంట్రాక్టుల్లో దళితులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
అన్ని రంగాల్లో దళితులు ఎదగాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో 100 మందికి యూనిట్లు అందజేస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో 256 మంది లబ్ధిదారులకు 254 మంది లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. వందశాతం దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు యూనిట్లను అందజేస్తామన్నారు.
సమావేశంలో జడ్పీ చైర్మన్ హేమలతశేఖర్‌గౌడ్, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మెదక్ ఎంపీపీ యమునజయరాంరెడ్డి, హవేళీఘణాపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు, పశు సంవర్ధకశాఖ అధికారి విజయశేఖర్‌రెడ్డి, సర్కారు దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, ఆయా శాఖల అధికారులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో రూ.3 కోట్లతో నిర్మించనున్న మున్సిపల్ దుకా ణ సముదాయానికి శుక్రవారం మంత్రి హరీశ్‌రా వు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇప్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో నూ తనంగా ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమా ల్లో జిల్లా యువజన సర్వీసుల శాఖ జనరల్ మేనేజర్ వేణుగోపాల్, జిల్లా యువజన, క్రీడలాధికారి నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు మేఘమాల, కృష్ణారెడ్డి, బట్టి లలిత, ఆర్కే శ్రీనివాస్, మామిళ్ల ఆంజనేయులు, దయార లింగం, ఆవారి శేఖర్, సమియోద్దీన్, లక్ష్మీనారాయణగౌడ్, వసంత్‌రాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డీఈ మహేశ్, ఆత్మకమిటీ డైరెక్టర్ మోచి కిషన్, టీఆర్ఎస్ నాయకులు దుర్గాప్రసాద్, శివరామకృష,్ణ ఉమర్, ప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డి, కుమ్మరి గోపాల్ తదితరులున్నారు.
జిల్లా కేంద్రంలోని మాతాశిశుసంరక్షణ కేంద్రంలో శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్‌రావు, సీఈవో డాక్టర్ రాధకృష్ణ, అర్థోపెడిక్ డాక్టర్ నవీన్, జనరల్ పిజీషియన్ పెంటగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికే సీఎం కేసీఆర్ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. బ్యాంక్ లింకేజీ లేకుండా దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షలు లబ్ధిదారులకు అందజేస్తున్నారన్నారు. మహనీయుడు, మహామనిషి సీఎం కేసీఆర్ అని, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని, అందులో భాగంగా మెదక్ జిల్లాలో కూడా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మెదక్ జిల్లాకు అన్ని సౌకర్యాలకు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావును కోరారు.
– ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
దేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి పథకాలు చేపట్టలేదని, సీఎం కేసీఆర్ అన్నివర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రమైన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి హరీశ్‌రావు సహకారంతో జిల్లా కేంద్రంలో 100 పడకల మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకున్నామన్నారు.
త్వరలో మెదక్‌కు రైలు కూత వినపడబోతుందని తెలిపారు. దళిత బంధు పథకం కింద మెదక్ నియోజకవర్గంలో 100 యూనిట్లు మంజూరయ్యాయని, ఒక్కో మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి 1500 చొప్పున కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మెదక్ పట్టణానికి టీయూఎఫ్ఐడీసీ కింద రూ.20 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటికీ రూ.10 కోట్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
– ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి