కొండాపూర్, ఆగస్టు 21: గ్రామాల్లో ఫ్రీడం పార్కుల ఏర్పాటుతో పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల పరిధిలోని తొగర్‌పల్లిలో కలెక్టర్ ఫ్రీడం పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీడం పార్కు ఏర్పాటుతో పల్లెలు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ స్థలంలో మొక్కలు నాటాలని, ప్రత్యేక శ్రద్ధ చూపించి మొక్కలను కాపాడాలన్నారు. ఫ్రీడం పార్కును ఎంతో సుందరంగా ఏర్పాటు చేయడం, వివిధ రకాల పూల మొక్కలను నాటడం సంతోషకరమన్నారు. మొక్కలు నాటడంలో కొండాపూర్ మండలం జిల్లాకు ఆదర్శంగా నిలవాలన్నారు. తక్కువ సమయంలోనే ఫ్రీడం పార్కును ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనికాశ్రీధర్రెడ్డి, ఎంపీపీ పట్లోళ్ల మనోజ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జయలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.