అందోల్/ మెదక్ మున్సిపాలిటీ ఆగస్టు 17: మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్యస్థాపన చేసిన యోధుడు. చారరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దార్ల అరాచకాలను చూసి కడుపుమండి కత్తి పట్టిన వీరుడికి ఇన్నాళ్లకు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరైన గుర్తింపు లభించింది. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని టీఆర్ఎస్ సర్కారు అధికారికంగా నిర్వహిస్తూ ఆ యోధుడికి తగిన గౌరవాన్ని ఇచ్చింది. దీంతో ఆయన జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాకతీయుల పాలన ముగిసిన 300 ఏండ్ల తర్వాత 1650 నుంచి 1709 వరకు సర్దార్ సర్వాయి పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తోంది. పాపన్న 1650 ఆగస్టు 18న వరంగల్ జిల్లా (ప్రస్తుత జనగామ) ఖిలా షాపూర్లో ధర్మన్నగౌడ్-సర్వమ్మ దంపతులకు జన్మించారు. పాపన్న తండ్రి చిన్న వయస్సులోనే చనిపోగా తల్లి సర్వమ్మ అన్నీ తానై పెంచింది.
పాపన్న కులవృతైన కల్లు గీతవృత్తిని కొనసాగిస్తూ భూస్వాములు, దేశ్ముఖ్లు సాగిస్తున్న దాష్టికాలను సహించలేక మూఢ సంప్రదాయాలను ఎదురించి పోరుబాటను ఎంచుకున్నాడు. అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కడితో సాధ్యం కాదని నమ్మాడు. మొత్తం బహుజన కులాలను ఏకంచేసి స్నేహితులైన చాకలి నర్సన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవింద్, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్సాహెబ్తో కలిసి చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణను వారికి వివరించి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు.
సైన్యం ద్వారా ధనవంతులు, జమీందారులపై రహస్య దాడులు చేసి కొల్లగొట్టిన ధనంలో కొంత పేదవారికి సాయం చేసి మరికొంత డబ్బుతో మెరుగైన ఆయుధాలు సమకూర్చుకుని సైన్యాన్ని విస్తరించుకున్నాడు. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అగ్రకుల భూస్వాములు, ధనవంతుల గడీలు, కోటలపై దాడులుచేసి దాచుకున్న ఆస్తులను కొల్లగొట్టి పేదలకు పంచడంతో పాటు గడీల్లో బందీలుగా మగ్గుతున్న వారికి విముక్తి కల్పించాడు.
ఇలా అతి తక్కువ సమయంలోనే పాపన్న సైన్యం 12వేలకు చేరింది. వీరికి సైనిక శిక్షణ, యుద్ధ విద్యలు నేర్పడానికి పాపన్న వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. శిక్షణ పొందిన సైన్యం ద్వారా సంస్థానాలు, గడీలపై మెరుపుదాడులు చేసి తన స్వగ్రామం ఖిలా షాపూర్ను రాజధానిగా చేసుకుని 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించి దుర్భేధ్యమైన కోటను నిర్మించాడు.
తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన పాపన్న విగ్రహాన్ని లండన్లోని విక్టోరియా అండ్ అల్బర్టు మ్యూజియంలో నాటి ప్రపంచ ప్రముఖుల విప్లవ యోధుల సరసన శాశ్వత విగ్రహాన్ని పెట్టడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.
మెదక్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): బడుగు జనాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఈనెల 18న అధికారికంగా నిర్వహించన్నట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10:30కు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం సభా కార్యక్రమాన్ని పసుపులేరు వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద రేణుక ఎల్లమ్మ మందిర ప్రాంగణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయం. ఎంతో చరిత్ర కలిగిన యోధుడికి ఇంతకాలం సరైన గుర్తింపు లభించలేదు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాపన్నగౌడ్కు తగిన ప్రాధాన్యత కల్పించి జయంతిని అధికారికంగా నిర్వహించేందు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం పాపన్నగౌడ్ చరిత్ర, కోటలు పరిరక్షణకు మరింత కృషిచేసి వాటి పరిరక్షణకు పాటు పడితే పాపన్నగౌడ్కు మరింత గౌరవం ఇచ్చినట్టు అవుతుంది.
– ప్రతాప్ లింగాగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సర్దార్సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర, ఉద్యమ నేపథ్యం ఎంతో గొప్పది. అది నేటితరం యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నది. దీనికి గౌడ సోదరులందరూ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– కృష్ణాగౌడ్, తెలుగు భాషోపాధ్యాయుడు